JSP Pawan on Volunteers : ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పునరుద్ఘాటించారు. జగన్ మహిళలను కించపరిచి రేపిస్టులను పెంపొందిస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్ల తప్పుడు పనులు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. జగన్ నిర్మించిన వాలంటీర్ వ్యవస్థ నడుం విరగ్గొడతానని హెచ్చరించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉంది.. ఆ సమాచారం అంతా ఎక్కడకు పోతోంది..? అమ్మాయిల అదృశ్యంపై వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు స్పందించరు? అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
అసలు విషయం పక్కదోవ పట్టించేందుకే తనపై వ్యక్తిగత విమర్శలకు వైఎస్సార్సీపీ నేతలు పాల్పడుతున్నారని పవన్ తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ నేతలు, వీరమహిళలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎవరో రిజిస్ట్రేషన్ చేసి పెట్టిన పార్టీని వైఎస్సార్సీపీ వాళ్లు తీసుకున్నారని అన్నారు. యువజనులు, శ్రామికులు, రైతులకు ఏమీ చేయని పార్టీ.. వైఎస్సార్సీపీ అని ధ్వజమెత్తారు. జగన్ అంటే తనకు కోపం లేదన్న పవన్.. ప్రభుత్వ విధానాలపైనే ద్వేషం అని, నాయకులు చేసిన తప్పులు ప్రజలపై ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. తనను బెదిరించారని, డబ్బుతో మభ్యపెట్టారని చెప్తూ.. పదేళ్ల పాటు పార్టీని నడపడం అంటే మాటలు కాదు అని.. రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉంది.. రాజకీయాలకు అనుగుణంగా నన్ను నేను మలచుకున్నా.. రాజకీయ ప్రవేశంపై నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది.. అందుకే నిలబడి ఉన్నా అని తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా..? ఉపాధి హామీ కూలీల కంటే వాలంటీర్లకు తక్కువ వేతనం ఇస్తున్నారు.. వాలంటీర్ వ్యవస్థపై నాకు కోపం లేదు.. కానీ, శ్రమ దోపిడీ గురించి నేను మాట్లాడుతున్నాను అని పవన్ తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా..? అంతకుముందు ప్రజా పంపిణీ జరగలేదా.. ఎండీయూలు లేకపోతే రేషన్ పంపిణీ జరగలేదా అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉంది.. దానిని వాళ్లు ఎందుకు ఉపయోగిస్తున్నారు అని ప్రశ్నించారు. విషయాన్నీ తప్పుదోవ పట్టించడానికి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, నా వ్యక్తిగత విషయాలపై చర్చలు పెట్టే నాయకులు.. అమ్మాయిల అదృశ్యంపై ఎందుకు మాట్లాడరు అని పవన్ దుయ్యబట్టారు.
అమ్మాయిలు అదృశ్యమైతే మాట్లడొద్దా.. మన వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే హక్కు జగన్‌తో సహా ఎవరికీ లేదన్న పవన్.. అమ్మాయిల అదృశ్యంపై పత్రికలు, ఛానళ్లు ఎందుకు చర్చించలేదని, వైఎస్సార్సీపీ నాయకులు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును ఉరి తీయాలని ఊగిపోతూ మాట్లాడిన జగన్.. వేల సంఖ్యలో అమ్మాయిలు అదృశ్యమైతే తానెలా మాట్లాడకుండా ఉంటానని పేర్కొన్నారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి వల్ల సమాచారం దుర్వినియోగం జరిగితే నిలదీయొచ్చు.. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడకి తీసుకెళ్తున్నారు..? మీ ఫోన్ పోయినా, హ్యాక్‌కి గురైనా ఎవరు సమాధానం చెప్తారు..? సేవ చేయడానికి వచ్చిన వాలంటీర్లు దాడులు చేస్తారా..? హత్యాచారాలకు పాల్పడతారా అని దుయ్యబట్టారు. వాలంటీర్ల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో గుర్తించాలని, దీనిపై ప్రజలకు అవగాహన ఉండాలని పవన్ కోరారు. రాష్ట్రానికీ రక్షణ చాలా అవసరం అని చెప్పిన పవన్.. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్‌నీ తట్టి లేపుతున్నానని చెప్పారు. జగన్ అనే జలగ ఆంధ్రప్రదేశ్‌ని పట్టి పీడిస్తోంది.. జగన్ కిరాయి మూకలను దింపుతాడు అని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకుల మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందన్న పవన్.. సర్ది చెప్పి బయటకు వస్తున్నా... నా వల్ల మాటలు పడుతున్నందుకు క్షమించమని అడిగా అని చెప్పారు. జగన్ సంస్కారహీనుడని పవన్ మండిపడ్డారు.
ప్రజలను నియంత్రించేందుకు వాలంటీర్లు: తొండ ముదిరి ఊసరవెల్లివలే వాలంటీరు వ్యవస్థ మారిందని.. ప్రజలను నియంత్రించి భయపెట్టే స్థాయికి చేరిందని పవన్ విమర్శించారు. బ్రిటిష్‌వాళ్లు దేశాన్ని ఆక్రమించేందుకు ఐదు వేల మందితో వచ్చి.. మన దేశ ఏజెంట్లతోనే మనల్ని నియంత్రించారని అన్నారు. ఆ విధంగానే ఆరు కోట్ల మంది ప్రజలను నియంత్రించేందుకు వాలంటీర్లను జగన్ ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి విధానాలపై తప్ప జగన్ అంటే తనకు కోపం, ద్వేషం లేదన్నారు. ఆయన వ్యక్తిగత విషయాలపై మాట్లాడే హక్కు జగన్‌తో సహా ఎవరికీ లేదని పవన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి, శుభకార్యానికి వెళ్లినా, ఎవరైనా చనిపోతే వెళ్లినా అదే నవ్వు నవ్వుతారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
వాలంటీరు వ్యవస్థ తప్పు చేస్తే నిలదీసే వ్యవస్థ ఏదని? వారు ఇళ్లలోకి వెళ్లి సేకరిస్తున్న సమాచారం ఎక్కడుందని? ఎక్కడ నిక్షిప్తం చేస్తున్నారని? సేవ చేయడానికి వచ్చిన వాలంటీర్లకు దాడి చేసే హక్కు ఉందా? ఆరేళ్ల బాలికపై వాలంటీరు అఘాయిత్యం చేస్తే జగన్ ఎందుకు మాట్లాడలేదని?’ ఇలా సూటి ప్రశ్నలు సంధించారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు తనను వ్యక్తిగతంగా తిట్టినా పట్టించుకోవద్దని అన్నారు.