Illegal Excavations in Kolleru: జీవవైవిధ్యానికి ఆవాసమైన ఏలూరు జిల్లా కొల్లేరు అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఐదో కాంటూరు పరిధిలో తవ్వకాలు, భారీ యంత్రాల వినియోగం, ఆక్వా సాగు నిషిద్ధమైనా.. క్షేత్రస్థాయిలో మాత్రం అవేమీ అమలు కావడంలేదు. వందల ఎకరాల్లో ఇష్టారాజ్యంగా చెరువులు తవ్వేస్తున్నారు. అక్రమార్కుల ధనదాహానికి కొల్లేరు సహజ రూపును కోల్పోతుంది. ఇప్పటికే అనధికారికంగా వందల ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగు చేస్తుండగా.. అధికారుల అలసత్వం, పట్టించుకోనితనం కారణంగా ఇది కాస్తా వేల ఎకరాలకు విస్తరిస్తూ సరస్సు మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతోంది. పూడిక తీత, చెరువుల మరమ్మతుల ముసుగులో ఏటా ఎండాకాలంలో కొల్లేరులో కొత్తగా అక్రమ చెరువులు పుట్టుకొస్తున్నాయి. కొందరు ఏప్రిల్ ఆరంభం నుంచి చెరువులు తవ్వుతుండగా.. మరికొందరు ఈ ఏడాది జనవరిలోనే చెరువులు తవ్వేశారు.
కైకలూరు పరిధిలోని పందిరిపల్లెగూడెం, చటాకాయ గ్రామాల్లో అక్రమ తవ్వకాలు బహిరంగ రహస్యం. పందిరిపల్లెగూడెంలోనే 15 ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లతో బుధవారం రాత్రి నుంచి దాదాపు వంద ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలోనే పెంచికలమర్రు అటవీ చెక్‌పోస్టు ఉంది. ఈ చెక్‌పోస్టు దాటే.. ఈ వాహనాలు, యంత్రాలన్నీ కొల్లేరులోకి అడుగుపెట్టాయి. చటకాయలోనూ.. 60 ఎకరాల్లో 3 చెరువులు తవ్వుతున్నారు. ఆకివీడు మండలం.. చినమిల్లిపాడులో 70, సిద్దాపురంలో 200 ఎకరాల్లో చెరువులు తవ్వకాలు పూర్తికావచ్చాయి.
ఏలూరు గ్రామీణ పరిధిలోని పైడిచింతపాడు, కొక్కిరాయిలంకలో.. ఇప్పటికే వేల ఎకరాల్లో చెరువులు తవ్వగా.. కొత్తగా ప్రత్తికోళ్లలంకలో మే మొదటి వారం నుంచి భారీ స్థాయిలో.. రొయ్యల చెరువులు తవ్వుతున్నారు. ప్రస్తుతం గుడివాకలంక, కొక్కిరాయిలంక,. ప్రత్తికోళ్లలంక, ఆగడాళ్లలంక గ్రామాల్లో పాత చెరువులకు మరమ్మతులు మొదలుపెట్టగా.. వీటి ముసుగులో భారీగా కొత్త చెరువులు తవ్వేస్తున్నారు. పాత చెరువులకు ఆనుకుని ఉన్న, గతంలో ప్రభుత్వం ధ్వంసం చేసిన చెరువులను.. ఏటా కొంచెం కొంచెంగా తమ చెరువుల్లో కలిపేసుకుంటూ ఆక్రమణల దందా సాగిస్తున్నారు.
అధికార వైసీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో.. ఈ తవ్వకాలు చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే.. కైకలూరు, ఏలూరుకు చెందిన ముగ్గురు వైసీపీ నాయకులు..ఇద్దరు మంత్రులను కలిశారు. అక్రమ తవ్వకాలకు అడ్డులేకుండా మంతనాలు సాగించారు. మంచినీటి చెరువుల తవ్వకాల ముసుగులో చేపలు, రొయ్యల సాగుకు పథకం వేశారు. కొల్లేరులో ప్రతీ గ్రామానికి వంద ఎకరాల చొప్పున భూములు తవ్వుకునేలా.. పావులు కదిపారు. కైకలూరు మండలంలోనే 500ఎకరాలు తవ్వకాలకు సిద్ధం చేశారు. ఐతే.. అవి పట్టాభూములంటూ అధికారులు మభ్యపెట్టేస్తున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే పరిశీలించి ధ్వంసం చేస్తామంటూ చెప్తున్నారు. కానీ అధికార పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం.. నేతలతో అన్నీ మాట్లాడాం మా జోలికి రావొద్దంటూ అధికారులనే హెచ్చరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇవీ చదవండి: