ధాన్యం నిల్వ చేసే గోదాములే ఆ విద్యార్థులకు తరగతి గదులు... ధాన్యం ఆరబెట్టే కల్లాలు వారికి పట్టు పాన్పులు... నిత్యం ధాన్యం బస్తాల మధ్యే వారి పడక. ఆరు బయటే స్నానాలు... ఇవన్నీ ఎక్కడా అనుకుంటున్నారా... ఓ గురుకుల పాఠశాలలో. దశాబ్దం క్రితం శంకుస్థాపన పూర్తి చేసుకుని నేటికీ భవనం పూర్తి కాకపోవడంతో... తాత్కాలికంగా మార్కెట్ యార్డులో పిల్లలకు వసతి గృహం, తరగతి గదులు ఏర్పాటు చేయడంతో సాక్షాత్కరించిన దృశ్యాలివి.
అన్ని వసతులు ఉండే సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుని, ప్రయోజకులవుతారని పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు వారి పిల్లలను సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చేరుస్తూ ఉంటారు. ఆకలితో కడుపు మాడకుండా వేళకు తిండితో పాటు... దుస్తులకు కొదవుండదని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే ఈ దృశ్యాలు చూసిన వారికి మాత్రం తమ ఆలోచన తప్పని తెలుసుకుంటారు. ఇది ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఓ సాంఘిక సంక్షేమ వసతి గృహం. అవును..! ఇక్కడ విద్యార్థులకు తరగతులు చెప్పడంతో పాటు వసతి గృహం కూడా ఇదే. విద్యార్థులకు ఆట స్థలం కూడా ఈ మార్కెట్ యార్డే.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల కోసం చింతలపూడి డిగ్రీ కళాశాల సమీపంలోని కనిపెడ రోడ్డులో గురుకుల పాఠశాల నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. తదనంతర ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రావడంతో.. రూ.7 కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణం, ఫర్నిచర్ ఏర్పాటు చేసేలా నిర్మాణం ప్రారంభించింది. తరగతి గదులు, విద్యార్థుల కోసం వసతి గృహం, డైనింగ్ హాళ్లు, ఉపాధ్యాయుల వసతి భవనాలు అన్నీ సిద్ధమయ్యాయి. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. అప్పటి మంత్రి పీతల సుజాత ఈ సముదాయంలో అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల కోసమని సుమారు రూ.90 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పనులు అక్కడితో నిలిచిపోయాయి. ఏళ్లుగా పనులు చేయకపోవడం... పూర్తైన భవనాలను గాలికి వదిలేయడంతో... ఆ ప్రాంగణం పిచ్చి మొక్కలు మొలిచి అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారింది.
ఐదో తరగతిలో 80 మందితో ప్రారంభమైన చింతలపూడి గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 634 మంది విద్యార్థులు ఉన్నారు. 5 నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అప్పట్లో చుట్టుపక్కల స్థలం లేకపోవడంతో...తాత్కాలికంగా చింతలపూడి మార్కెట్ యార్డు గోదాముల్లో తరగతులు చెబుతూ అక్కడే విద్యార్థులకు వసతి కల్పించారు. ఏటా విద్యార్థుల సంఖ్య పెరగడం... అందుకు తగ్గట్లు అక్కడ వసతులు లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు గురుకుల పాఠశాల కోసం నిర్మిస్తున్న భవనం దశాబ్దం గడిచినా పూర్తి కాకపోవడంతో... విద్యార్థులు ఇప్పటికీ ఆ మార్కెట్ యార్డులోనే కాలం వెళ్లదీస్తున్నారు. యార్డులోనే తింటూ ఆరు బయటే స్నానాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. దోమలతో సావాసం చేస్తూ... చలిలో ధాన్యం బస్తాల మధ్యే నిద్రిస్తూ నిత్యం నరకం చూస్తున్నారు.
ప్రభుత్వాలు మారడంతో పాటు పాలకులు మారుతున్నా... విద్య, వైద్యం లాంటి కనీస మౌలిక వసతులకు సంబంధించిన నిర్మాణాలపై పాలకులతో పాటు అధికారులు దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాల్లో చదువుకుని తమ పిల్లలు ప్రయోజకులవుతారని తల్లిదండ్రులు భావిస్తే... ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా ఉందని చెబుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో పాఠశాల భవనాల నిర్మాణం పూర్తి చేసి మార్కెట్ యార్డులో అవస్థలు పడుతున్న విద్యార్థులను వెంటనే అక్కడి నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి :