Fees for burials in cemeteries: ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ స్మశాన వాటికలలో అంత్యక్రియలు, ఖననం కోసం ఒక్కొక్క మృతదేహానికి 5 వేల రూపాయలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్ బాబురావు అన్నారు. స్మశాన వాటికల నిర్వహణ, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయటం స్థానిక సంస్థల చట్టపరమైన బాధ్యత అని గుర్తు చేశారు. ఏలూరు నగరపాలక సంస్థ తన బాధ్యతను విస్మరించి అంత్యక్రియలకు ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించడం గర్హనీయమన్నారు. స్థానిక సంస్థలు ప్రజలకు సేవ చేసే సంస్థలుగా ఉండాలన్నారు.కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ సంస్కరణల పేరుతో ప్రతి పౌర సదుపాయానికి యూజర్ చార్జీలను వసూలు చేసే విధానాలను ప్రవేశపెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్తిపన్నులు ఆస్తి విలువ ఆధారంగా పెంచారు, ఏనాడు లేని రీతిలో చెత్త పన్ను బలవంతంగా వసూలు చేస్తున్నారు. మంచినీటి కుళాయిలకు నీటి మీటర్లు బిగిస్తున్నారు. మరుగుదొడ్లు లెక్కించి భూగర్భ డ్రైనేజీకి ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు స్మశానవాటికల్లో అంత్యక్రియలకు ఫీజులు నిర్ణయించి వసూలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. కాటికాపర్లకు వేతనాలను నగరపాలక సంస్థ చెల్లించాలి అంతే తప్ప ఆ భారాన్ని మృతుల కుటుంబాలపై వేయకూడదని దుయ్యబట్టారు. స్మశానవాటికలను కూడా ఆదాయ వనరుగా పరిగణించరాదని ధ్వజమెత్తారు. ఏలూరు నగరపాలక సంస్థలో పాలక పక్షంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ తక్షణమే నగరపాలక సంస్థ తీర్మానాన్ని రద్దు చేయాలి, స్మశాన వాటికలో ఫీజులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పౌరసదుపాయాలకు యూజర్ చార్జీలను వసూలు చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను రద్దు చేయాలని కోరారు.
ఇవీ చదవండి: