కరోనాతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఉద్ఘాటించారు. సోమవారం నుంచి కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సంస్థలకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. పంట ఉత్పత్తుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పారు.
కూరగాయలు, పండ్లను ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో ద్వారా విక్రయించడానికి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. సోమవారం నుంచి ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కావాల్సిన వారు ఈ యాప్స్‌లో ఆర్డర్ పెడితే ప్రభుత్వం ఇంటికే సరఫరా చేస్తుందని వివరించారు.
రైతులు ఇక నుంచి విత్తనాల కోసం క్యూలో నిలబడే అవసరం లేదన్న మంత్రి... గ్రామ స్థాయిలోనే విత్తనాల పంపిణీ చేస్తామని చెప్పారు. రైతుల నుంచే నేరుగా విత్తనాలు కొనుగోలు చేసి... శుద్ధి చేసిన అనంతరం గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తామన్నారు. అలాగే అర్హులుంటే వైఎస్‌ఆర్ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామన్నారు. అన్నదాతలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని దళారులను మంత్రి హెచ్చరించారు.
ఇదీ చదవండి