గత నెల 15న పాపికొండల విహారయాత్రకు బయలుదేరి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ఠ బోటు నీట మునిగింది. బోటులో ప్రయాణించిన 77 మంది ప్రయాణికుల్లో 26 మందిని స్థానికులు రక్షించారు. 51 మంది జలసమాధి అయ్యారు. వరద ఉద్ధృతిలో చిక్కుకుని బోటు మునిగిపోయింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ దుర్ఘటనలో చనిపోయారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వ యంత్రాంగం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించింది. మరో 13 మంది ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఎదురు చూపులు తప్పలేదు. బోటు వెలికితీస్తే మరికొన్ని మృతదేహాలు దొరుకుతాయని భావించారు.
ధర్మాడి సత్యం బృందం శ్రమకు ఫలితం
బోటు వెలికితీత సాధ్యాసాధ్యాలపై, బోటు చిక్కుకున్న ప్రాంత లోతుపై చాలా సందేహాలు తలెత్తాయి. బోటు ఒడ్డుకు చేరడం అసాధ్యమని నిపుణులు సైతం తేల్చేశారు. ఈ పరిస్థితుల్లో కాకినాడకు చెందిన మత్య్సకార నిపుణుడు ధర్మాడి సత్యం బృందం బోటును ఒడ్డుకు చేర్చే బాధ్యతను తీసుకున్నారు. ఈ నెల మొదటి వారంలో బోటును ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు మూడు రోజుల పాటు చేశారు. నదిలో వరద ప్రవాహం ఉద్ధృతిగా ఉండటం, పరిస్థితి అనుకూలించకపోవడం వల్ల పనులు నిలిపిపేశారు. ఈ నెల 15 నుంచి మరోసారి ధర్మాడి సత్యం బృందం ముమ్మరంగా గాలింపుచర్యలు చేపట్టారు. 25 మంది సభ్యుల బృందం నదిలో లంగర్లు, రోప్ వేసి బోటును ఒడ్డుకు చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓసారి బోటుకు సంబంధించిన ఇనుప రైలింగ్ రావటం బోటు కచ్చితంగా ఉన్న ప్రదేశాన్ని నిర్ధారించుకుని, ప్రయత్నాలు కొనసాగించారు. ధర్మాడి బృందం శ్రమ ఫలించకపోవడం వలన విశాఖకు చెందిన డైవర్ల బృందాన్ని ఆశ్రయించారు. పదిమంది బృందాన్ని దేవీపట్నం తీసుకొచ్చి నదిలోకి దించారు. ఎట్టకేలకు డైవర్ల శ్రమ ఫలించి బోటును ఒడ్డుకు చేర్చగలిగారు.
కుటుంబసభ్యుల ఎదురుచూపులు
కాకినాడకు చెందిన కెప్టెన్ ఆదినారాయణ పర్యవేక్షణలో రెస్య్కూ ఆఫరేషన్ కొనసాగించి, అతి కష్టంమీద బోటును ఒడ్డుకు చేర్చారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 12 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. అయితే 8 మృతదేహాలే బోటులో గుర్తించారు. మృతదేహాలు ఏ మాత్రం గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. వాటిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ ఆత్మీయుల చివరి చూపు కోసం బాధిత కుటుంబసభ్యులు బోటువెలికితీత కోసం ఇన్నాళ్లు ఎదురుచూశారు.
మృతదేహాలను గుర్తించడం ఎలా..?
ప్రభుత్వ లెక్కల ప్రకారం గత గురువారం లభ్యమైన భౌతికకాయంతో కలిపి 9 మృతదేహాలు దొరికాయి. మిగతా వారి మృతదేహాలు ఇక లభ్యమవుతాయా అన్నది సందేహంగా మారింది. మాంసపు ముద్దలుగా మారిన మృతదేహాలను గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. వారు వేసుకున్న దుస్తులే గుర్తించడానికి చివరి ఆధారంగా ఉంది. అయితే అధికారులు మాత్రం జన్యు పరీక్షలు చేసిన తర్వాతే ఎవరు అన్నది తేలుస్తామన్నారు. మృతదేహాలు లభ్యమైనా బాధితులను గుర్తించడానికి ఎంత సమయం పడుతుందో అన్న ఆవేదన బాధిత కుటుంబ సభ్యుల్లో నెలకొంది.
ఇదీచదవండి