మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తూ .. వారిపై దురాగతాలకు తెగబడుతున్న నేరాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలిచింది. జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన-2017 సంవత్సర నివేదిక చేదు వాస్తవాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రకాల నేరాలు 30 లక్షల 62 వేల 579 నమోదు కాగా... వాటిలో లక్షా 32 వేల 336 నేరాలు మన రాష్ట్రంలోనే జరిగాయి. అత్యధిక నేరాలు జరిగిన రాష్ట్రాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో నిలిచింది. సైబర్, ఆర్థిక నేరాలు, మహిళలు, వృద్ధులపై నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై దురాగతాలు, జువెనైల్స్ పాల్పడ్డ నేరాల్లో మొదటి పది స్థానాల్లో మన రాష్ట్రం నిలవడం ఆందోళ కలిగిస్తోంది.
నివేదికలో చేదు వాస్తవాలు
మహిళలపై అత్యాచారాలకు సంబంధించి 2017 నివేదిక ప్రకారం... 988 కేసులు నమోదు కాగా వాటిలో 934 ఘటనల్లో పరిచయస్తులే నిందితులుగా ఉన్నారు. 96 ఘటనల్లో కుటుంబ సభ్యులే దోషులుగా తేలారు. బాలలు చేసిన నేరాల్లో అత్యధిక శాతం దొంగతనాలు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం, హత్యలు వంటివి ఉన్నాయి . పోలీసులు అరెస్టు చేసిన జువెనైల్స్‌లో అత్యధిక శాతం మంది తొలిసారి పట్టుబడ్డ వారే. వృద్ధులపై జరిగే నేరాల్లో ఎక్కువ శాతం మోసాలు, దురాక్రమణలు వంటివి ఉన్నాయి. ఆర్ధిక నేరాల్లో అత్యధిక శాతం... మోసం, ఫోర్జరీలకు చెందినవి ఉన్నాయి. బెదిరింపులకు పాల్పడటం , వ్యక్తిగత కక్షలు, లైంగిక దోపిడీ తదితర ఉద్దేశాలతో ఎక్కువమంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని నివేదిక వెల్లడించింది.
లక్షకు పైగా నిందితులు అరెస్టు
వివాహేతర సంబంధాలతో రాష్ట్రంలో 178 హత్యలు జరగ్గా.. అసలు ఏ కారణం లేకుండానే 55 హత్యలు జరిగాయని నివేదిక వెల్లడించింది. 2017లో రాష్ట్రంలో లక్షా 31 వేల 660 మంది అరెస్టు కాగా.. వారిలో లక్షా 17వేల 742 మంది తొలిసారి అరెస్ట్ అయినవారే ఉన్నారు. 3వేల 39 మంది గతంలో వివిధ కేసుల్లో శిక్షలు అనుభవించినట్లు నివేదిక తేల్చింది. పోలీసులు నేరాలపై ఉక్కుపాదం మోపినప్పుడే... పరిస్థితి తీవ్రత తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీచదవండి