తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు ఏడుగురు ఉద్యోగులను ఈవో సస్పెండ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నా కొంతమంది భక్తులను స్వామి దర్శనానికి అనుమతించిన క్రమంలో ఆ చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఈ క్రమంలో ఆ సమయంలో విధుల్లో ఉన్న దేవస్థాన సూపరింటెండెంట్ రాధాకృష్ణ, సబార్డినేట్ ఆదినారాయణతో పాటు కేశఖండన శాలలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందిని ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరు సత్యనారాయణ రాజు సస్పెండ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి భక్తులకు ఆలయ ప్రవేశం చేయించిన ఘటనపై ఆ గ్రామ రెవెన్యూ అధికారి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలయ అధికారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.