రాజ్యాంగ విరుద్ధం
పశ్చిమ బంగా, కర్ణాటక, తెలంగాణ, నాగాలాండ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మిజోరాం, మణిపూర్లలో ఇలాంటి నియామకాలే గతంలో జరిగాయన్న ఆయన...పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ హైకోర్టులు ఇటువంటి నియామకాలను రాజ్యాంగ విరుద్ధమని తీర్పులు ఇచ్చాయని పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉండటానికి తగడన్న యనమల..ఎన్నికల సంఘం వెంటనే విజయసాయిరెడ్డిని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలన్నారు.
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్
విజయసాయిరెడ్డిని దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ గత నెల 22వ తేదీన జీవో నెం.68 జారీ చేశారని తెలిపిన యనమల విత్ ఇమిడియట్ ఎఫెక్ట్ కింద ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఆ జీవోలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ నియామకాన్ని రద్దు చేస్తూ ఇవాళ మరో జీవో తెచ్చారని తెలిపారు. 13 రోజుల పాటు ఆ పదవిలో విజయ సాయి రెడ్డి ఉన్నారన్నారు. ఈ 13రోజులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పనిచేసిన విజయసాయిరెడ్డిని తక్షణమే ఎంపీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేసారు.
ఆర్టికల్ 103 కింద ఆయనను చట్టసభలో అనర్హుడిని చేయాలన్నారు. చట్టం తెలియదని చెప్పడం కూడా రాజ్యాంగం ప్రకారం చెల్లదన్న యనమల...పార్లమెంట్ మినహాయింపు ఈ పదవికి లేదన్నారు. ఈ అంశంపై వెంటనే వైకాపా నేతపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువస్తుందన్నారు.
మంత్రి వర్గ ఉపసంఘంలో ఎంపీలా?
ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేయడానికే ఇటువంటి నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని యనమల తెలిపారు. దిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసుకునేందుకే కేబినెట్ ర్యాంకుతో ఈ పదవిని విజయసాయిరెడ్డి పొందారనేది వాస్తమన్నారు. విజయసాయిరెడ్డితో పాటు ముగ్గురు పార్లమెంట్ సభ్యులను మంత్రివర్గ ఉపసంఘంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారని యనమల పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులను రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా నియమించిన దాఖలాలు లేవన్నారు.
ఇదీ చదవండి : కాంట్రాక్టు ఇవ్వాల్సిందే... తుపాకీతో వైకాపా నేత బెదిరింపు!