పదో తరగతి... ఈ పదం చెవిన పడితే చాలు విద్యార్థుల మదిలో తెలియని భయం. తల్లిదండ్రుల మనసులో చెప్పలేని ఆందోళన. ఉత్తమ విద్యకు... విద్యార్థుల ఆలోచన... తల్లిదండ్రుల తపన... ఉపాధ్యాయుల నిర్ణయం... సర్కారు సహృదయత... వెరసి జ్ఞానధార జీవం పోసుకుంది. ఈసారి పది ఫలితాల్లో ప్రభుత్వ బడి తలెత్తుకు నిలబడటానికి ఈ జ్ఞానధారే కారణంగా నిలిచింది.
తూర్పు గోదావరిలో భేష్...
జ్ఞానధారలో శిక్షణ పొందినవారిలో ఎక్కువ శాతం విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించి శభాష్ అనిపించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమం అద్భుతంగా సాగింది. గత పది ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఎక్కువమంది విద్యార్థులు పదికి పది జీపీఏలు సాధించారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 39మంది పదికి పది జీపీఏ సాధించడం... జ్ఞానధార విశిష్టతను చాటి చెప్పింది.
కాకినాడలో 200 మందికి...
కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 14 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో మొత్తం 1200 మంది తొమ్మిదో తరగతి పూర్తి చేసి పదిలోకి అడుగు పెడుతున్నారు. తొమ్మిది పూర్తయిన వెంటనే వారిలో 200 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ఆనంద భారతి పాఠశాలలో జరుగుతున్న తరగతుల్లో 79మంది స్పార్క్ విభాగంలో, 121మంది స్మార్ట్ విభాగంలో పాఠాలు నేర్చుకుంటున్నారు. తెలుగు, సోషల్ మినహా అన్ని సబ్జెక్టులూ బోధిస్తూ... స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా ఇస్తున్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం 6నుంచి 9గంటల వరకూ మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాటు అల్పాహారం అందిస్తున్నారు.
"జ్ఞానధార" వెంటిలేటర్‌పై ఉన్న ప్రభుత్వ విద్యకు పునరుజ్జీవం పోస్తోంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సర్కారీ చదువుకు సరికొత్త భాష్యం పలుకుతోంది.