సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసులో పవన్ ఫణికి బెయిల్ లభించింది. సొంత పూచీకత్తుపై ఫణికి గుంటూరు 6వ అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఫణి రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించింది. సీఎంను చంపుతానని పోస్టులు పెట్టినట్లు పవన్ ఫణిపై నమోదైన కేసు సెక్షన్లపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ఆధారాలు లేకుండా... రాజద్రోహం, ప్రభుత్వంపై యుద్ధం వంటి సెక్షన్లతో కేసు నమోదు చేయటాన్ని ప్రశ్నించారు. నిందితుడిని జైల్లో ఉంచాలనే ఇలాంటి సెక్షన్లు పెట్టారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఫణిపై కేసు.. ఎందుకంటే...
Youngster arrested for social media post: మానవబాంబుగా మారి సీఎంను చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన యువకుడిని.. సీఐడీ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శుక్రవారం సైబర్ క్రైం ఎస్పీ రాధిక వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన రాజాపాలెం ఫణి.. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 16న ట్విటర్‌లో పెట్టిన పోస్టుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించినట్టు తెలిపారు. అయితే, వెంటనే ఆ పోస్టు డిలీట్ చేయడంతో పాటు.. నిందితుడు ట్విటర్ అకౌంట్ మూసేశాడు. ఫోన్ కూడా స్విచాఫ్ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫణిని అరెస్టు చేశామని..నిందితుడు జనసేన మద్దతుదారుడని ఎస్పీ రాధిక తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అతడితో మా పార్టీకి సంబంధం లేదు - జనసేన
సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసే వారిని ప్రోత్సహించమని జనసేన మీడియా విభాగం తెలిపింది. సీఎంను చంపుతానని పోస్టు చేసిన వ్యక్తికి, తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ అభిమాని ముసుగులో పోస్టులు చేసేవారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించాలని.. వాస్తవ, విశ్లేషణాత్మక, చైతన్యపరిచేలా పోస్టులు ఉండాలని వివరించింది.
ఇదీ చూడండి: