కరోనా కాలం అక్రమార్కులకు అనువైన సమయంగా మారింది. ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయడంతో జిల్లాలో బియ్యం అక్రమ రవాణా అడ్డగోలుగా జరిగింది. 8 నెలల్లో రూ. 2 కోట్ల విలువైన పేదల బియ్యం పట్టుబడింది. ఇప్పటికే చెక్‌పోస్ట్ ఏర్పాటులకు ప్రతిపాదనలున్నా.. అవి ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు.
జిల్లాలోని 17 లక్షల తెల్లకార్డు దారులకు 2,659 చౌక దుకాణాల ద్వారా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతినెలా 25 వేల టన్నుల బియ్యాన్ని పేదలకు అందజేస్తున్నారు. ఎనిమిది నెలలుగా ప్రతినెలా రెండు పర్యాయాలు 50 వేల టన్నులు చొప్పున సరఫరా చేశారు. ఇదే అవకాశంగా కార్డుదారుల నుంచి కేజీ రేషన్ బియ్యాన్ని రూ. 10 చొప్పున కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు వాటిని కేజీ రూ. 15కు విక్రయిస్తున్నారు. ఇలా సేకరించిన వాటిని రైస్ మిల్లులకు అనుబంధంగా ఉన్న గోదాములకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇన్‌వాయిస్ సృష్టించి, దర్జాగా కాకినాడ పోర్టుకు తరలించి విదేశాలకు పంపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎనిమిది నెలలుగా ప్రతినెలా జిల్లాలో 20 వేల టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించినట్లు అంచనా వేస్తున్నారు. జిల్లాలో సుమారుగా 400 మిల్లులు ఏటా పౌరసరఫరాల సంస్థకు సీఎంఆర్ ఇస్తున్నాయి. వీటిలో కొంతమంది మిల్లర్లు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి, వాటినే సీఎంఆర్ కింద సరఫరా చేస్తున్న సందర్భాలూ వెలుగు చూశాయి. పౌరసరఫరాల అధికారులు గతంలో రైస్ మిల్లుల్లో ఏ, బీ రిజిస్ట్రర్లను తనిఖీ చేసేవారు. కొంత కాలంగా అలా చేయడంలేదు. వీరికున్న అధికారాలను నిలిపివేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్, ఇతర నిఘా సంస్థలు అక్రమాలపై మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
ఇదండీ సంగతి
జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏప్రిల్ నుంచి ఈనెల 28 వరకు నిర్వహించిన దాడుల్లో పెద్దఎత్తున చౌకబియ్యం పట్టుబడ్డాయి. అక్రమ నిల్వ కేంద్రాలు, కొన్ని మిల్లుల్లో ఏకంగా రూ. రెండు కోట్ల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎనిమిది నెలల్లో 12చోట్ల దాడులు నిర్వహించి, 29 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. 284 టన్నుల పేదల బియ్యాన్ని పట్టుకున్నారు.
చెక్‌పోస్టులు ఏవీ?
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కాకినాడ పోర్టుకు పెద్దఎత్తున బియ్యాన్ని తరలిస్తున్నారు. గతంలో ఇలా తరలిస్తున్న వాటిలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పోర్టుకు వెళ్లే మార్గంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. అది కార్యరూపం దాల్చకపోవడంతో యథేచ్ఛగా చౌక బియ్యాన్ని కూడా తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆగని రీసైక్లింగ్
కారు చౌకగా రేషన్ బియ్యాన్ని కొట్టేసి రీసైక్లింగ్ చేసి, అదే బియ్యాన్ని సన్నబియ్యంగా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని గొల్లప్రోలు ప్రాంతంలోని కొన్ని రైస్‌మిల్లులకు.. కాకినాడ, పరిసర ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని రామచంద్రపురం, యానాం, కాకినాడ సమీపంలోని కొన్ని మిల్లులకు తరలిస్తున్నారు.
క్రిమినల్ కేసులు పెడతాం..
రేషన్ బియ్యం కొనడం నేరం. వీటిని రీసైక్లింగ్ చేసి అమ్మడం మరింత నేరం. ఇటువంటి వాటికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. పీడీ చట్టం కూడా ప్రయోగించడానికి వెనుకాడం. డీలర్లు అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. రైస్‌మిల్లులు, ప్రైవేటు గోదాముల్లో పలు శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలిచ్చాం.-జి.లక్ష్మీశ, సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ)
ఇదీ చూడండి.