శనివారం తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. పవన్ శ్రమదానానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కరోనా వల్ల అనుమతివ్వట్లేదని జనసేనకు పోలీసులు స్పష్టం చేశారు. మరో వైపు పవన్ పర్యటన దృష్ట్యా పలుచోట్ల రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. కాటన్ బ్యారేజీపై గుంతలు పూడ్చారు. అనంతపురం జిల్లాలో కూడా శనివారం పవన్ పర్యటనకు అనుమతి లభించలేదు. పవన్ రాకముందే అనంతపురం జిల్లా కొత్త చెరువు రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. పోలీసులు అనుమతి ఇవ్వకున్నా పవన్ పర్యటిస్తారని జనసైనికులు చెబుతున్నారు.
జనసేన సభకు అనుమతిలేదు: అదనపు ఎస్పీ లతామాధురి
‘‘హుకుంపేట పంచాయతీ బాలాజీపేట సెంటర్‌లో బహిరంగసభకు జనసేన పార్టీ నేతలు అనుమతి అడిగారు. సుమారు 20వేల మంది సభకు తరలివచ్చే అవకాశం ఉంది. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. బాలాజీపేట ప్రాంతంలో అంతమందితో సభ నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సభావేదిక మార్చుకోవాలని ఇప్పటికే జనసేన పార్టీ ప్రతినిధులకు సూచించాం. వారి నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. బాలాజీపేటలో అయితే సభకు అనుమతివ్వలేదు. జనసేన తరఫున శ్రమదానానికి అనుమతి కోరలేదు’’ -అదనపు ఎస్పీ లతామాధురి
వేదిక మార్చిన జనసేన
ఏపీలో రోడ్ల పరిస్థితికి నిరసనగా పవన్ కల్యాణ్ శనివారం చేపట్టనున్న శ్రమదానం కార్యక్రమం వేదిక మారింది. నిరసన కార్యక్రమాన్ని తొలుత రాజమహేంద్రవరంలోని కాటన్ బ్యారేజీ వద్ద నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ జలవనరుల శాఖ అధికారులు అనుమతి నిరాకరించడంతో వేదికను హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చారు. బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం రోడ్డుపై పవన్ శ్రమదానం చేయనున్నారని జనసేన నేతలు తెలిపారు.
ఇదీ చదవండి: