Nara Lokesh Yuvagalam Padayatra: సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. పున:ప్రారంభమైంది. 76 రోజుల విరామం అనంతరం తూర్పుగోదావరి జిల్లా తాటిపాక నుంచి నడకను ప్రారంభించారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు మద్దతుగా పెద్దఎత్తున తెలుగుదేశం నేతలు తరలివచ్చారు. టీడీపీ శ్రేణులకు పోటీగా జనసైనికులు కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజోలు నియోజకవర్గం తాటిపాక సెంటర్లో నిర్వహించిన బహిరంగసభకు జనసంద్రం పోటెత్తింది. కోనసీమ నలుమూలల నుంచి ప్రజలు, అభిమానులు సభకు భారీగా హాజరయ్యారు. ఇరు పార్టీ శ్రేణుల నినాదాలతో సభ దద్దరిల్లింది.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజాబలంతో సాగే యువగళం (Yuvagalam) ఆగదని లోకేశ్ తేల్చిచెప్పారు. యువగళం పాదయాత్రకు 76 రోజుల విరామం ఇచ్చినందుకు ప్రజల్ని క్షమాపణ కోరారు. యువగళం ప్రజాగళంగా మారిందని స్పష్టం చేశారు. చంద్రబాబుని చూస్తే సైకో జగన్‌కు భయమని.. అందుకే అక్రమంగా అరెస్ట్ చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు బెయిల్ ఆర్డర్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని ఎంతలా నియంత్రించారో అర్ధమవుతుందని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ తేదీ ఖరారైందన్నారు. సైకో జగన్మోహన్ రెడ్డిని 3 నెలల్లో ప్రజలు పిచ్చాసుపత్రికి పంపటం ఖాయమని ధ్వజమెత్తారు.
యువగళం జనగళమై! - పునః ప్రారంభమైన లోకేశ్ పాదయాత్రకు మద్దతు వెల్లువ
తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కేసులు ఎదుర్కోక తప్పదు: జగన్‌కు అవకాశం ఇస్తే.. పేదల కడుపు నింపిన అన్నా కాంటీన్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు గండిపడిందని రేపో మాపో చంద్రబాబుపై కొత్త కేసు పెడతారని లోకేశ్ ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని అనేక ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
వచ్చేది తెలుగుదేశం - జనసేన ప్రభుత్వమే: గడపగడపకు మన ప్రభుత్వం నుంచి ఏపీ నీడ్స్ జగన్ వరకు వైసీపీ చేస్తున్న అన్ని కార్యక్రమాలను ప్రజలు తిరస్కరిస్తున్నారన్న లోకేశ్.. బస్సు యాత్ర తుస్సు యాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లలో వైసీపీ చేసింది సామాజిక న్యాయం కాదు.. సామాజిక అన్యాయమని విమర్శించారు. వైసీపీ ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొంటామన్న లోకేశ్.. వచ్చేది తెలుగుదేశం - జనసేన ప్రభుత్వమేనని స్పష్టంచేశారు.
ప్రజల కోసం దేనికైనా సిద్ధం: జగన్ బ్లూ బటన్ నొక్కి 10 రూపాయలు ప్రజలకు పంచుతూ.. మరో పక్క రెడ్ బటన్ నొక్కి వారి వద్ద నుంచి 100 రూపాయలు లాగేస్తున్నాడని విమర్శించారు. జగన్ యువత భవిష్యత్తుపై దెబ్బకొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్.. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలనే జగన్ కోరుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్ని ఇబ్బందులు పడినా ఓర్చుకునేందుకు సిద్ధమని తేల్చిచెప్పారు.
ప్రజాక్షేత్రంలోకి లోకేశ్- యువగళం పాదయాత్ర పునః ప్రారంభం
బాధితులకు లోకేశ్ భరోసా: బహిరంగసభ అనంతరం పి.గన్నవరం నియోజకవర్గంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. 2014 జూన్ 27న జరిగిన ఓఎన్జీసీ - గెయిల్ పైపులైన్ల బ్లాస్టింగ్‌లో 22 మంది చనిపోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారని.. అప్పటి టీడీపీ ప్రభుత్వ చొరవతో ఒక్కొక్కరికి 25 లక్షలు పరిహారం అందిందని గుర్తుచేశారు. గెయిల్ యాజమాన్యం.. బాధితులు, గ్రామస్థులకు ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని లోకేశ్‌కు వివరించారు.
గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చి నేటికీ తీసుకోలేదని చెప్పారు. పేలుడు ధాటికి బీటలు వారి ఇళ్ల స్థానంలో కొత్తవి కట్టిస్తామని చెప్పారని.. ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన పదేళ్లు కావస్తున్నా ఓఎన్జీసీ – గెయిల్ అధికారులు ఇప్పటివరకు బాధితులను ఆదుకోకపోవడం దురదృష్టకరమని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించినపుడు బాధితులను ఆదుకోవాల్సిన పూర్తి బాధ్యత చమురు సంస్థలదే అని అన్నారు. ఓఎన్జీసీ - గెయిల్ అధికారులతో మాట్లాడి బాధితులు, నగరం గ్రామస్థులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
వైసీపీ తప్పుడు కుట్రలు న్యాయం ముందు బద్దలయ్యాయి: నారా లోకేశ్
అనంతరం లోకేశ్ మామిడికుదురులో స్థానికులతో సమావేశమయ్యారు. పాశర్లపూడి, అప్పనపల్లి మీదుగా సాగిన పాదయాత్ర అమలాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. బోడసకుర్రు గ్రామంలో మత్స్యకారులతో భేటీ అయిన లోకేశ్.. పేరూరులో రజక సామాజికవర్గీయులతో సమావేశమయ్యారు. రాత్రికి పేరూరు శివారు విడిది కేంద్రంలో లోకేశ్ బస చేశారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర సాగింది. 210వ రోజు అయిన నేడు రాజోలు, పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది.
చెరువులను కబ్జా చేయాలని చూడటం దుర్మార్గం: అమలాపురం పేరూరు గౌరీశంకర రజక సేవాసంఘం ప్రతినిధులు లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాత ముత్తాతల కాలం నుంచి 3 ఎకరాల ఖాళీస్థలం ఉందని, అధికారపార్టీకి చెందిన కొంత మంది తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నారని రజకులు తెలిపారు. రజకుల జీవనాధారమైన చెరువులను కబ్జా చేయాలని చూడటం దుర్మార్గమని లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రజకుల వృత్తిచేసుకునే చెరువులన్నింటినీ ఆక్రమణల చెరనుంచి విడిపించి, ఆయా సొసైటీలకే అప్పగిస్తామని హామీఇచ్చారు.
లోకేశ్‌ను కలిసిన మత్స్యకారులు: అమలాపురం బోడసకుర్రుకు చెందిన మత్స్యకారులు లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చేపలవేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులందరికీ 90 శాతం సబ్సిడీపై వలలు, పడవలు, మోపెడ్లు అందజేయాలని కోరారు. పడవలపై ఇసుక తీసుకునే ర్యాంపులను స్థానికంగా ఉండే మత్స్యకార సొసైటీలకే రాయితీపై ఇవ్వాలన్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ పదవిని అగ్నికుల క్షత్రియులకే కేటాయించాలని కోరారు. తీరప్రాంతాల్లో అగ్నికుల క్షత్రియులు పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల చొప్పున వడ్డీలేని రుణాలను అందజేయాలని కోరారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మత్స్యకారులతోపాటు బీసీ కులాల వారందరినీ దారుణంగా మోసగించాడని లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆదరణ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టి చేతివృత్తుల వారికి గతంలో మాదిరి పనిముట్లు అందజేస్తామని హామీఇచ్చారు. దామాషా ప్రాతిపదికన అగ్నికుల క్షత్రియులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు.
కరవు, జగన్ కవల పిల్లలు - చిన్న కరవే అని సీఎం చెప్పడం మూర్ఖత్వం : లోకేశ్