పరీక్షల నిర్వహణపై డిగ్రీ, పీజీ విద్యార్థుల్లో నెలకొన్న ఉత్కంఠకు యూజీసీ తెరదించి ఆఖరి సెమిస్టర్ నిర్వహించాల్సిందేనని మార్గదర్శకాలు జారీచేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంకు సుమారు 434 అనుబంధ కళాశాలలున్నాయి. రెండు జిల్లాల పరిధిలో డిగ్రీ, పీజీ ఆఖరి సెమిస్టర్ పరీక్షలు రాసే 27,200 మంది విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలి. పరీక్ష కేంద్రం వద్ద థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు విద్యార్థుల వస్తువులు శానిటైజ్ చేసి అనుమతించనున్నారు. విద్యార్థిలో కొవిడ్ లక్షణాలుంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష హాలులో బెంచికి ఒక్కరు చొప్పున సుమారుగా ఒక గదికి 12 మందిని మాత్రమే కేటాయిస్తారు.
ఈ నెల 14 నుంచి 24 వరకు డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నారు. 25వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆఖరి సంవత్సరం విద్యార్థులకు మూడు, నాలుగు సెమిస్టర్లలో ఉన్న బ్యాక్‌లాగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 14 నుంచి 24 వరకు పీజీ ఆర్ట్స్ కోర్సు విద్యార్థులకు, 28 నుంచి వచ్చే నెల 5 వరకు పీజీ సైన్సు కోర్సు విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి, క్వారంటైన్, కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, మరే ఇతర కారణాల వల్ల పరీక్షలకు హాజరుకాలేకపోతే నవంబరులో ప్రత్యేకంగా మరోసారి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
“కొవిడ్ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు అనుబంధ కళాశాలలకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేశాం. యూజీసీ నెట్, సెట్ పరీక్షల షెడ్యూలు వస్తే దానికి అనుగుణంగా ఒక పరీక్ష తేదీలో స్వల్ప మార్పులొచ్చే అవకాశం ఉంది. పరీక్షలకు ఒకరోజు ముందు వర్సిటీ వసతి గృహానికి అనుమతులు ఇస్తారు. పరీక్షల తరువాత రోజు ప్రాజెక్టులు, వైవా సమర్పించాల్సి ఉంటుంది.” - ఆచార్య మొక్కా జగన్నాథరావు, వీసీ, ఎస్.లింగారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
ఇవీ చదవండి: అంతర్వేది రథం నిర్మాణం కోసం కలపను పరిశీలించిన మంత్రి