ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు అర్హులు ఓటు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. రెండు జిల్లాల్లో 20 వేల నుంచి 25 వేల మంది ఓటు నమోదు చేసుకుంటారని ప్రాథమిక అంచనా. కానీ.. పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికీ కేవలం 1,140 మంది మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేశారు. శుక్రవారం నాటికి తూర్పుగోదావరి జిల్లాలో 702, పశ్చిమగోదావరి జిల్లాలో 438 దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి.
ప్రస్తుత ఎమ్మెల్సీ రాము సూర్యారావు పదవీ కాలం 2021 మార్చి 29తో ముగియనున్న తరుణంలో అక్టోబరు 1న ఓటు నమోదుకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు జిల్లాల్లో తహసీల్దారు, ఎంపీడీవో, ఆర్డీవో కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నోటిఫికేషన్ ప్రదర్శించారు. నవంబరు 6తో ఓటు నమోదు గడువు ముగియనుంది. డిసెంబరు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. డిసెంబరు 31 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరించి.. జనవరి 18న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. 2015లో ఇదే ఎన్నికల్లో 21,899 మంది ఓటర్లుగా చేరారు
14 రోజులే గడువు:
2020 నవంబరు 1 నాటికి ఆరేళ్లలో మూడేళ్లు ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పని చేసిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు హక్కు కల్పించనున్నారు. అన్‌ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే వారికి డీఈవో, ఆర్‌ఐవో ధ్రువీకరణతో ఓటు హక్కు కల్పిస్తారు. http:///ceoaperolls.ap.gov.in/ap_mlc_2020/ login.aspx వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్ఛు
117 పోలింగ్ కేంద్రాలు
ఎమ్మెల్సీ ఎన్నికకు 117 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. తూ.గో.లో 68, ప.గో.లో 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు నగరపాలక సంస్థల పరిధిలో రెండేసి, ప్రతి మండలంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అర్హులు నమోదు చేసుకోవాలి
అర్హులైన ఉపాధ్యాయులు ఓటు నమోదు చేసుకోవాలి. ఈనెల 1, 15న పాఠశాలలు, కళాశాలల్లో ఓటు నమోదు నోటీసులు ప్రదర్శించాం. రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించాం. నవంబరు 6 వరకే నమోదుకు వీలుంది. తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఫారం-19 దరఖాస్తులు ఉన్నాయి. వాటిని పూరించి, అక్కడే ఇవ్వాలి. ఆన్‌లైన్‌లోనూ నమోదును సద్వినియోగం చేసుకోవాలి. -సత్తిబాబు, డీఆర్వో
ఇదీ చూడండి. రేపే విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయం ప్రారంభం