విశాఖలో..
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను క్షత్రియ సంక్షేమ సమతి విశాఖలో ఖండించింది. పూసపాటి వంశం చేసిన దాన ధర్మాలను కొనియాడిన క్షత్రియ సంక్షేమ సమితి.. దూషించిన మంత్రి ఎంతమాత్రం ఆ పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదన్నారు. వెంటనే మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
వేల ఎకరాలను, లక్షల కోట్ల విలువైన సంపదలను దేవాలయాలకు దానంగా ఇచ్చిన ఘనత పూసపాటి రాజవంశీయులదని.. అటువంటి కుటుంబానికి చెందిన అశోకగజపతి రాజుపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన మంత్రి రాజీనామా చేసేవరకూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అందోళనలు చేస్తామని సమితి నేతలు స్పష్టం చేశారు. మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమారాజు మాట్లాడుతూ.. దేవాలయాల్లో దేవతామూర్తులను పరిరక్షించడం చేతకాని వెల్లంపల్లి.. తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆయనకు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. అశోక్ గజపతిరాజుకు మంత్రి క్షమాపణలు చెప్పాలని.. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలుగుచేసుకోవాలని క్షత్రియ సంక్షేమ సమతి సభ్యులు కోరారు. వెల్లంపల్లి రాజీనామా చేయకుంటే క్షత్రియ శక్తి చూపిస్తామన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో..
మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని తూర్పు గోదావరి జిల్లా కోనసీమ క్షత్రియ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గజపతిరాజు పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రభుత్వానికి, వెల్లంపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమలాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు చిలువురు సతీష్ రాజు మాట్లాడుతూ అశోక్ గజపతిరాజు ఎన్నో కోట్ల రూపాయలను వేల ఎకరాలను దేవాలయాల అభివృద్ధికి విరాళాలు ఇచ్చారన్నారు. ప్రస్తుత మంత్రి వెల్లంపల్లి విజయవాడలో కొబ్బరి చిప్పలను అమ్ముకుంటూ జీవించాడని.. అశోక్ గజపతిరాజు విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షత్రియ యూత్ సభ్యులు ఉద్యమం చేపడతామన్నారు. అశోక్ గజపతి రాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఇదీ చదవండి: మంత్రి వెల్లంపల్లిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: ఎంపీ రఘురామ