తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాన్నివరద వణికిస్తోంది. కోనసీమలోని 16 మండలాల్లో 15 మండలాలకు చెందిన వివిధ లంక గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కరకట్టల లోపల ఉన్న లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద రెండో ప్రమాద హెచ్చరికను దాటిపోయి మూడో ప్రమాద హెచ్చరికకు చేరువవుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సుమారు 17 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు. కోనసీమలోని 50 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరద పెరుగుతున్న తీరు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. పి గన్నవరం పాత కొత్త అక్విడెక్ట్ మధ్య గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా సాగుతోంది. లంక గ్రామాల ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో రావులపాలెంలోని గౌతమి వశిష్ట వంతెన వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పెద్ద పెద్ద చెట్లతో పాటు పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. వరద దాటికి కె.ఏనుగుపల్లి గ్రామం పూర్తిగా జలదిగ్బంధమైంది. సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టకపోవటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద ప్రవాహానికి పెద్ద పెద్ద ఆలయాలు సైతం నీటిలో మునిగిపోయాయి. జొన్నాడ వద్ద ఉన్న దేవాలయాలు కూడా నీటిలో చిక్కుకున్నాయి. కోనసీమలో 4 గ్రామాల పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. బూరుగు లంక, అరిగెల వారి పేట. పెదపూడి లంక గ్రామాలు వశిష్ట గోదావరి నదికి మధ్యలో ఉండటంతో నానా పాట్లు పడుతున్నారు.
గోదావరి నదిపై వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా అధికారులెవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి