Illegal Sand Mining Without Permits: టెండర్లు ఖరారు కాకుండానే.. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలకు తెరలేపారు. నిల్వ కేంద్రాల్లో కొందరు విక్రయాలు ఆరంభించారు. అనుమతులు లేవు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే సీఎంవో పేరు చెబుతున్నారు. అక్రమ దందా కోసం.. జిల్లాకో ఇన్ఛార్జ్‌ను నియమించారు. వీరి తెరవెనుక పులివెందుల నేత సోదరులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రమంతా మూడు ప్యాకేజీలుగా ఇసుక టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. వీటన్నింటిలో రెండు సంస్థలే బిడ్లు వేశాయి. ఒకటి, రెండు రోజుల్లో బిడ్లు తెరిచి గుత్తేదారులను ఖరారు చేయనున్నారు. కానీ కొత్తవాళ్లు ఇప్పటికే తవ్వకాలు, అమ్మకాలు మొదలు పెట్టేశారు.
ఇసుక రవాణా బిల్లు పుస్తకాలు దహనం - అక్రమాలు బయటపడకుండా ఉండేందుకేనా?
జిల్లాకు ఓ ఇన్ఛార్జ్‌ను, ప్యాకేజీకి ఒకరు చొప్పున ముగ్గురు రీజనల్ ఇన్చార్జులను నియమించారు. వారి పర్యవేక్షణలో తమిళనాడు, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లు విక్రయాలు చేస్తున్నారు. మొన్నటి వరకు JPసంస్థ పేరిట ఇసుక వ్యాపారం జరగ్గా.. ఉపగుత్తేదారుగా ఉన్న టర్న్‌కీ గత ఏడాది ఆగస్టులో వైదొలగేలా చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో పలు విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న కాకినాడకు చెందిన వైసీపీ నేత ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేశారు. కానీ అసలు వ్యక్తులు ఇపుడు బయటకొస్తున్నారు.
కాకినాడ నేత వంటి పేరే కలిగిన పులివెందులకు చెందిన కీలక కుటుంబానికి చెందిన వ్యక్తి ఇసుక సిండికేట్ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆయన, ఆయన సోదరులు చెన్నైలో ఉంటూ ఇక్కడ ఇసుక దందా నడిపిస్తున్నట్లు సమాచారం. తాజాగా నిర్వహించిన ఇసుక టెండర్లలో కూడా ఓ కంపెనీ పేరిట టెండర్లు దక్కించుకొని.. ఆ పులివెందుల సోదరుల ద్వారానే ఇసుక తవ్వకాలు, విక్రయాలు కొనసాగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం వీరికి చెందినవాళ్లనే తమిళనాడు నుంచి రప్పించి స్టాక్ పాయింట్లు, రేవుల్లో నియమించడంతో.. చాలాకాలంగా అక్కడ పనిచేస్తున్న స్థానికులకు ఉపాధి లేకుండాపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క రేవులో కూడా ఇసుక తవ్వకాలకు కొత్తగా అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ- సియా అధికారులు తెలిపారు.
Illegal Sand Mining in Krishna River: కృష్ణాతీరంలో ఇసుక తవ్వకాలు.. కొండలను తలపిస్తున్న ఇసుక డంపులు
జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు వల్ల రాష్ట్రంలో 110 రేవుల్లో తవ్వకాలు ఆపేయాలని ఏప్రిల్లోనే ఆదేశాలిచ్చామని, ఇదే విషయాన్ని ఎన్జీటీకి నివేదించామని చెబుతున్నారు. ఆ 110 రేవుల్లో తవ్వకాలకు గనులశాఖ కానీ, టెండరు పొందిన గుత్తేదారు కానీ మళ్లీ దరఖాస్తు చేసుకొని పర్యావరణ అనుమతి పొందాలని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు కొత్త అనుమతులేవీ ఇవ్వలేదన్నారు. సియా అనుమతి ఇవ్వకపోయినా రేవుల్లో దర్జాగా ఇసుక తవ్వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన గనుల శాఖ, పర్యావరణ నియంత్రణ మండలి అధికారులు చేష్టలు చూస్తున్నారు. ఇసుకలో అక్రమాలు జరగకుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యదళం తీరూ అలాగే ఉంది.