Godavari Water Flow at Dhavaleswaram: గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా నీరు నదిలోకి వచ్చి చేరుతోంది. కాళేశ్వరం బ్యారేజీ నుంచి నీరు దిగువకు వదులుతుండడంతో రెండు రోజులుగా అది నదిలోకి వచ్చి కలుస్తోంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద ప్రవాహం పెరిగింది. ఆనకట్ట వద్ద 10.4 అడుగుల నీటి మట్టం ఉంది. వరద నీరు 1లక్షా 31వేల 097 క్యూసెక్కులు నీరు సముద్రంలోకి విడుదల చేశారు. పంట పొలాలకు 10వేల 200 క్యూసెక్కుల నీరు అందించారు. వీటిలో తూర్పు డెల్టాకు 3వేల 6000, మధ్య డెల్టాకు 2వేల 600. పశ్చిమ డెల్టాకు 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పటి వరకు నీలం రంగులో ఉన్న గోదావరి నీరు.. ఎరుపు రంగును సంతరించుకుంది.
Devipatnam Gandi Poshamma Temple Closed: అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో గోదావరి ఉద్ధృతి గంట గంటకు పెరుగుతోంది. గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. వరద ప్రవాహం పెరగటంతో అధికారులు అప్రమమత్తమయ్యారు. గత ఏడాది ఇదే సమయంలో కూనవరం, చింతూరు, దేవీపట్నం మండలాల్లోని గ్రామాలు వరదలకు.. నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు దేవిపట్నంలోని గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు బయల్దేరే బోట్లను నిలిపివేశారు.దేవిపట్నంలోని గండి పోశమ్మ అమ్మవారి ఆలయంలోకి నీరు చేరటంతో ఆలయాన్ని అధికారులు మూసివేశారు.
Flood to Polavaram Project: ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద ప్రవాహంతో గోదావరిలోని నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 27.85 మీటర్లకు చేరింది. రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా మొన్నటి వరకు బయటకు వచ్చిన వరద.. ప్రస్తుతం స్పిల్ వే క్రస్ట్ గేట్ల ద్వారా వెళ్తోంది. ప్రాజెక్టులోకి వరద నీరు చేరటంతో 42 గేట్లు ఎత్తి లక్షా 15 వేల 136 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. శుక్రవారం నాటికి పోలవరం ప్రాజెక్ట్ ఎగువ కాఫర్ డ్యాం పైభాగంలోని గోదావరి నిండుకుండలా కనిపించింది. వీరవరపులంక, పూడిపల్లి పరిసర ప్రాంతాలలో ఉన్న ఇసుక తిన్నెలు పూర్తిగా నీటమునిగాయి. పాపికొండల విహార యాత్రను కూడా అధికారులు నిలిపేశారు. దండంగి, డి. రావిలంక గ్రామాల మధ్య పంట భూములను వరద ప్రవాహం ముంచెత్తింది.