Pathetic Situation Of Old Woman at Vijayawada : కన్న తల్లిదండ్రులను భారంగా భావించి వారిని వదిలేస్తున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. నవ మాసాలు మోసి, కని పెంచిన అమ్మను ఓ కుమార్తె భారంగా భావించింది. కొంచెం కూడా దయ లేకుండా మతిస్థిమితం లేని ఆ వృద్ధురాలిని వృద్ధాశ్రమం వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఆశ్రమం వారు సైతం లోపలికి రానివ్వలేదు. దీంతో ఆకలితో అలమటిస్తూ తన బిడ్డ వస్తుందని ఆ తల్లి రోడ్డుపైనే ఎదురు చూస్తూనే ఉండిపోయింది. ఈ హృదయ విదారక సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే
గుంటూరు చెందిన రమాదేవి తన ఒక్కగానొక్క కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచి పోషించింది. మంచి చదువులు చదివించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో వివాహం చేసింది. తన అవసరం తీరిపోయిందని అనుకుందో ఏమో మానసిక వికలాంగురాలైన ఆ తల్లి పట్ల కఠినంగా వ్యవహరించింది. కొన్ని రోజుల కిత్రం విజయవాడ నగర శివారు రాజీవ్ నగర్లోని మున్సిపల్ శాఖ వృద్ధాశ్రమంలో జాయిన్ చేసింది ఆ తల్లిని. అనంతరం వృద్ధురాలు రమాదేవిని వరదల సమయంలో కుమార్తె, అల్లుడు ఇంటికి తీసుకు వెళ్లారు. అనంతరం వృద్ధురాలిని ఆశ్రమానికి తీసుకురావొద్దని నిర్వాహకులు చెప్పారు.
Pathetic Situation Of Old Couple: పట్టించుకోని పిల్లలు.. అనాథలైన వృద్ధ దంపతులు
శుక్రవారం ఓ ద్వి చక్రవాహం మీద తీసుకువచ్చి రాజీవ్ నగర్లోని వృద్ధాశ్రమం వద్ద వృద్ధురాలిని వదిలేసి వెళ్లిపోయారు. ఇది గమనించిన ఆశ్రమం నిర్వాహకులు ఆమెను లోపలికి రానివ్వలేదు. ఏం జరుగుతుందో తెలియని ఆ తల్లి ఆశ్రమం గేటు పట్టుకుని అలాగే ఉండిపోయింది. వృద్ధురాలు ఆకలితో అలమటిస్తూ దీన స్థితిలో ఉన్నా ఎవ్వరూ పటించుకోలేదు. వృద్ధురాలిని నిర్బంధంగా తీసుకువచ్చి వృద్ధాశ్రమం గేటు వద్ద వదిలేసి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. వృద్ధురాలి కుమార్తెకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదని అంటున్నారు.
స్థానిక నాయకులు వృద్ధాశ్రమం వద్దకు వచ్చి వృద్ధురాలిని ఆశ్రమంలో ఉంచుకోవాలని సిబ్బందిని కోరగా వారు ససేమిరా అన్నారు. దీంతో మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న నిర్వాహకురాలిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి వృద్దురాలికి న్యాయం చేయాలని కోరారు.
భోజనం తీసుకువస్తానని వెళ్లిన కుమారుడు - రోడ్డు వైపే చూస్తూ ఉన్న తల్లి