CM Chandrababu Respond on Tribals Protest: గిరిజనుల ఆందోళనపై ముఖ్యమంత్రి చంద్రబాబు 'ఎక్స్'లో స్పందించారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులను కాపాడతామని, గిరిజనుల అస్థిత్వాన్ని కాపాడటమంటే భారత సంస్కృతిని కాపాడటమే అని అన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాల పెంపునకు నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు.
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అందించామన్న సీఎం, అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపునకు కృషి చేస్తామని తెలిపారు. జీవో నెం.3 ద్వారా ఉమ్మడి రాష్ట్రంలోనే కృషి చేశామని, గిరిజన ఉపాధ్యాయ పోస్టులు స్థానికులకే దక్కేలా కృషి చేశామని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల న్యాయపర చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దయిందని, జీవో నెం.3 పునరుద్ధరణకు కృషి చేస్తామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలనేది తమ ఆలోచన అని తెలిపారు.
గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం...1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు.
— N Chandrababu Naidu (@ncbn) February 11, 2025
గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేము నిరంతరం పనిచేస్తున్నాం.…
గిరిజనులకే హక్కు ఉండాలనే ఆలోచనతో వచ్చిన 1/70 చట్టం మార్చే ఉద్దేశం లేదని, తప్పుడు ప్రచారాలు, అపోహలతో ఆందోళన చెందవద్దని సూచించారు. సమాజంలో అట్టడుగున ఉన్న గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.
ఏజెన్సీలో 48 గంటల బంద్: గిరిజన చట్టాల పరిరక్షణ కోరుతూ వివిధ సంఘాలు 48 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అరకులో వర్తక, వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఉదయం నుంచే బంధు నిర్వాహకులు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. అరకులో పర్యాటక ప్రాంతాలైన గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం తదితరాలు మూతపడ్డాయి.