Wife Planned to Kill Husband: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఏకంగా భర్తనే హత్య చేయించింది ఒక మహిళ. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం నగర శివారులోని కియా కార్ల షోరూమ్ వద్ద ఈ నెల ఒకటవ తేదీన ధర్మవరం మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కాశీని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దీనిపై కాశీ భార్య సౌభాగ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిందితులను పట్టుకున్నారు. వాస్తవాలు తెలిసి పోలీసులు సైతం విస్తుపోయారు. టమాటా మండీలో కూలీలతో పని చేయించే మేస్త్రిగా కాశీ ఉండేవాడు. అయితే ఇటీవల పొలం అమ్మి బెంగళూరులో వ్యాపారం చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతని భార్య సౌభాగ్య టమాటా మండీలో కూలీలతో పని చేయించే బాధ్యత తీసుకుంది. ఈ క్రమంలో నవాజ్ అనే ఒక కూలీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మార్కెట్ అంతా తెలిసిపోయింది.
వెంటనే భర్త వీరిద్దరిని మందలించి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తమకు ఎప్పటికైనా కాశీ నుంచి ప్రమాదం ఉందని భావించి, నవాజ్‌తో కలిసి తన భర్తను హత్య చేయించాలని సౌభాగ్య నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కాశీని మద్యం తాగేందుకని తీసుకెళ్లి బాటిల్‌తో కొట్టి, బండరాయితో మోది హత్య చేశారు. ఈ హత్యకు మరో వ్యక్తి కూడా సహకరించాడు. పోలీసులు ముగ్గుర్నీ అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
"నవాజ్‌కి, సౌభాగ్యకి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇందులో భాగంగా వారు రాత్రి సమయాల్లో మాట్లాడుకునే ఫోన్ కాల్స్, ఇతర విషయాలు సౌభాగ్య భర్తకి తెలిసిపోయాయి. ఈ విషయంలో కాశీ తన భార్యతో గొడవపడ్డాడు. అనంతరం ఎలా అయినా సరే నా భర్తను చంపేయండి అని సౌభాగ్య నవాజ్‌తో చెప్పింది. లేకపోతే మనకి కష్టం అవుతుంది అని చెప్పింది. దీంతో నవాజ్, మరో వ్యక్తి మద్యం తాగినట్లు నటించి, కాశీకి కూడా మద్యం తాగించి హత్య చేశారు. ఇక్కడ పోస్టుమార్టం అయిపోయిన వరకూ ఉన్న సౌభాగ్య తరువాత కనిపించకుండా పోయింది. అదే విధంగా వీరిపై ఊరిలో రకరకాల అనుమానాలు రావడంతో విచారణ చేస్తే ఈ విషయాలు అన్నీ బయటకు వచ్చాయి". - శేఖర్, అనంతపురం రూరల్ సీఐ
'నీకు నీ భర్త బాధ వదిలింది' - మర్డర్ చేసి ప్రియురాలికి ప్రియుడి ఫోన్