గోదావరి ఉద్ధృతిలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం, వీరవరం, తొయ్యురు, దండంగి, పోశమ్మగండి, పూడిపల్లి, మంటూరు, మడిపల్లి, ఏనుగులగూడెం, అగ్రహారం గానుగులగొంది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆధ్వర్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రంపచోడవరం, గోకవరం, ముసునిగుంట గ్రామాలతో పాటు దేవీపట్నం సమీప ప్రాంతంలో కొండలపై 6,555 మంది ఆశ్రయం పొందేందుకు 14 సహాయక కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రత్యేక లాంచీలను ఏర్పాటు చేశారు.
సహాయక కేంద్రాలలో ఉన్న బాధితులకు అధికారులు కొవిడ్ పరీక్షలు చేయిస్తున్నారు. 8 మంది గర్భిణులను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రతి సహాయక కేంద్రంలో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నారు. ఐటీడీఏలో కంట్రోలు రూం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ధవళేశ్వరంలో మూడవ ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. ఎటువంటి విపత్తు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పీవో ప్రవీణ్ ఆదిత్య అన్నారు.
ఇదీ చదవండి : ఇకనుంచి రాష్ట్ర విపత్తులుగా వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలు