Sankranti Celebrations 2025 in AP : రాష్ట్రవ్యాప్తంగా భోగి, సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పండగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడాయి. భోగి పర్వదినాన ఊరూవాడా తెల్లవారు జామునే సందడి నెలకొంది. ఏడాదంతా సుఖశాంతులతో ఉండాలని, నవ ధాన్యాలు, సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ, భోగి మంటలు వేశారు. కొత్త కాలానికి స్వాగతం పలుకుతూ, భోగిమంటల చుట్టూ చిన్నా పెద్దా కేరింతలు కొట్టారు.
ఈ క్రమంలోనే విజయవాడలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో స్ధిరపడిన వారే కాక దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం ఇందులో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి అందిచాలనే లక్ష్యంతో వారిని దీనిలో భాగస్వామ్యం చేశారు. పిల్లలకు పండగ విశిష్టత, సంప్రదాయాలను తెలియజేశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఫన్ టైం క్లబ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంక్రాంతి వేడుకలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, రంగవళ్లులు కనువిందు చేశాయి. తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోకుండా భావి తరాలకు తెలియజేయడం, వారు పాటించేలా చేయడమే లక్ష్యంగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ చిన్ననాటి మధుర స్మృతులు గుర్తుకు వచ్చాయని పలువురు పేర్కొన్నారు.
నారావారిపల్లెలో సంక్రాంతి సందడి - పోటీల్లో పాల్గొన్న మహిళలకు కానుక