Government Purchase Tomato from Farmers: అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టమాటా రైతులకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రైతులను ఆదుకొనేందుకుగాను తీసుకునే చర్యలలో భాగంగా, టమాటా ధర చాలా తక్కువగా పలుకుతున్న అనంతపురం జిల్లా నుండి ప్రభుత్వమే టమాటాను సుమారు కిలో 8 రూపాయలకు కొనుగోలు చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు బజార్లకు సరఫరా చేస్తున్నారు.
ఈ రోజు 1000 క్వింటాళ్ల టమాటాను అనంతపురం, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుండి సేకరించారు. వీటిలో విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుండి సేకరించిన టమాటాలను విశాఖపట్టణం, రాజమండ్రి జిల్లాల్లోని రైతబజార్లలోనూ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సేకరించిన టమాటాలను విజయవాడ, గుంటూరు జిల్లాల రైతుబజార్లలో అమ్మకం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. తద్వారా రైతులకు సరైన గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (MIS)లో NAFED, NCCF ద్వారా రాష్ట్రంలో ఉన్న టమాటాలను అన్ని ఆపరేషన్‌ల ఖర్చులను వారే భరించే విధంగా, టమాటా కొరత ఉన్న ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో విక్రయించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో కిలో టమాటా ధర సుమారు 10 నుండి 15 రూపాయల వరకు రైతులకు అందుతుందన్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా ఈ టమాటాలను పంపి రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకొని రైతన్నలను ఆదుకునే విధంగా కలెక్టర్లకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు ఇచ్చారు.
ఒకప్పుడు ఎర్రపండు రేంజే వేరు - కానీ ఇప్పుడు రైతన్నలకు కన్నీళ్లే!