Occupied Forest Land Survey in Sajjala Estate: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండతో అప్పనంగా భూములు కొట్టేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల భూ బాగోతం వెలుగు చూస్తోంది. ప్రభుత్వ, అటవీ భూములు కబ్జా చేయలేదని బుకాయిస్తున్నా అక్షరాల 55 ఎకరాల అటవీ భూమి సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉందని రెవెన్యూ అధికారులు తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల బృందం అటవీ భూమి సరిహద్దు రాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమైంది. సజ్జల ఎస్టేట్‌లో ఆక్రమిత భూమిపై సర్వే ప్రారంభం కాగా మరో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.
సజ్జల ఎస్టేట్‌లో అటవీ భూములు: వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సజ్జల ఎస్టేట్ లో పదుల సంఖ్యలో అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు, డీకేటీ పట్టా భూములు కూడా కబ్జా చేసినట్లు బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల జనార్ధన్ రెడ్డి, సజ్జల సందీప్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో 146 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. వీటిలో సజ్జల సందీప్ రెడ్డి పేరిట 71.49 ఎకరాలు, సజ్జల జనార్ధన్ రెడ్డి పేరిట 18.85 ఎకరాలు, నర్రెడ్డి బాగిరెడ్డి పేరిట 19.22 ఎకరాలు, వై. సత్య సందీప్ రెడ్డి పేరిట 21.46 ఎకరాలు, సజ్జల విజయకుమారి పేరిట 7.30 ఎకరాలు ఉంది. ఇంకా కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ జరిగాయి.
సమగ్ర సర్వే చేస్తున్న అధికారులు: ఈ ప్రాంతంలోనే సర్వేనంబర్ 1629 లో 11 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన 55 ఎకరాలు సజ్జల కుటుంబ సభ్యులు కలిపేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో కడప డీఎఫ్ఓగా పనిచేసిన అధికారిపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ హయాంలో అటవీ భూములను ఆక్రమణ చేసుకున్నట్లు తెలిసింది. ఈ భూములపై రెండు నెలల నుంచి లెక్కతేలక పోవడంతో ఇటీవల రెవెన్యూ అధికారులు సజ్జల ఎస్టేట్ లో 55 ఎకరాల అటవీ భూమి ఉందని సర్వే నంబర్లతో సహా గుర్తించారు. ఈ అంశంపై సజ్జల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా సమగ్ర విచారణ చేసి సరిహద్దులను గుర్తించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సర్వే రాళ్లను గుర్తించిన అధికారులు: ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, అటవీశాఖ, ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల బృందంతో కమిటీ వేసింది. శుక్రవారం త్రిసభ్య కమిటీ అధికారుల బృందం సజ్జల ఎస్టేట్‌లోకి వెళ్లి సర్వే చేపట్టారు. కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, సీకే దిన్నె తహశీల్దార్ నాగేశ్వర్రావు, బద్వేలు సబ్ డీఎఫ్ఓ స్వామి వివేకానంద, ఎఫ్ఆర్వో ప్రసాద్, ల్యాండ్ సర్వే అధికారి మురళీకృష్ణ తదితర అధికారుల బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే నిర్వహించింది. రెవెన్యూ, అటవీ భూముల మ్యాపులు దగ్గర పెట్టుకుని సర్వేను నిర్వహించారు. మొదటి రోజు సర్వేలో 55 ఎకరాల అటవీ భూమికి సంబంధించిన సరిహద్దు రాళ్లను గుర్తించారు.
కుటుంబ సభ్యుల భూబాగోతం: అవి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపై మ్యాపుల ద్వారా ఆరా తీస్తున్నారు. సజ్జల ఎస్టేట్ భూములకు కంచె ఏర్పాటు చేసుకున్నారు. ఇది అటవీశాఖ నిబంధనలకు విరుద్ధమమని అధికారులు అంటున్నారు. అటవీ జంతువులు సమీపంలోని అటవీ భూముల్లోకి సంచారం చేయాల్సి ఉండగా వాటికి అడ్డుకట్ట వేసే విధంగా సజ్జల కుటుంబ సభ్యులు కంచె ఏర్పాటు చేయడం నిబంధనల ఉల్లంఘనేనని అధికారులు భావిస్తున్నారు. ఇంకా నాలుగు రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుందని అధికారులు చెబుతున్నారు. అధికారులు సజ్జల ఎస్టేట్‌లో సర్వే చేస్తున్న సమయంలో సజ్జల కుటుంబ సభ్యులు కూడా ఎస్టేట్‌లోనే ఉన్నారు.
సజ్జల ఎస్టేట్‌లో సర్వే నంబర్ 1612 లో రాజానాయక్ కుటుంబసభ్యులకు చెందిన 2.14 ఎకరాల డీకేటీ పట్టా భూములను కూడా ఆక్రమించారని బాధితుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. వీటన్నింటిపై అధికారులు సమగ్రంగా సర్వే కొనసాగిస్తున్నారు. సజ్జల ఎస్టేట్ లో అధికారుల బృందం సర్వే చేస్తున్న సమయంలో ప్రధాన గేటుకు తాళం వేసి సజ్జల కుటుంబసభ్యులు, అనుచురులు కాపలా ఉన్నారు. మీడియా ప్రతినిధులు ఆ ప్రాంతానికి వెళ్తే ఎవరికి అనుమతి లేదని అడ్డుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎవరికీ అనుమతుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం అధికారులు మాత్రమే లోపలికి అనుమతిచ్చి మీడియా వాళ్లు ఎవరూ లోపలికి రాకుండా అనుచరులు ఆంక్షలు విధించారు.
వెలుగులోకి మరో భూబాగోతం... 150 కోట్ల విలువైన స్థలాలు అన్యాక్రాంతం
తిరుపతిలో బుగ్గమఠం భూములు స్వాహా - తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న దందాలు
అంతా నా ఇష్టం 'ఏపీఎండీసీలో' పెద్దిరెడ్డి తీరు - పనిలేకపోయినా 370 మందికి జాబ్స్