రాజమహేంద్రవరం తాడితోట అంబేడ్కర్ నగర్‌లో.. ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. తొమ్మిదేళ్ల నిషాన్, ఏడేళ్ల రితికకు విషమిచ్చిన తల్లి శివపావని ఉరి వేసుకుంది. వీరితో పాటు శివపావని తల్లి కృష్ణవేణి కూడా బలవన్మరణానికి పాల్పడింది. సామూహిక ఆత్మహత్యలకు వివాహ బంధంలో గొడవలే కారణమని బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
రాజమహేంద్రవరానికి చెందిన శివపావని... విజయవాడకు చెందిన నాగేంద్రను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని... అదనపు కట్నం కోసం నాగేంద్ర వేధించేవాడని మృతుల బంధువులు ఆరోపించారు. మరో మహిళను పెళ్లి చేసుకున్నానని నాగేంద్రే స్వయంగా శివపావనికి ఫోన్ చేసి చెప్పాడని... ఆవేదనతో అక్కడికి వెళ్లిన శివపావని, ఆమె తల్లిపై నాగేంద్ర కుటుంబసభ్యులు దాడి చేశారని వెల్లడించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... విషం తీసుకున్న ఇద్దరు చిన్నారుల్లో ఒకరు కొనఊపిరితో బతికి ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రికి తరలించేలోపే ఆ చిన్నారి మృతిచెందింది. మృతదేహాలను శవపరీక్షకు పంపించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.