Farmers Are Worry About Grain Bags: తేమ శాతం, ఈ-క్రాప్ నమోదు, బ్యాంకు గ్యారెంటీలు..ఇలా పలు నిబంధనలతో ముప్పుతిప్పలు పడుతున్న అన్నదాతలు..తాజాగా గోనె సంచుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ధాన్యం విక్రయాలు నత్తనడకనే సాగుతున్నాయి. తూర్పు డెల్టా పరిధిలోని అనపర్తి, మండపేట, రామచంద్రపురం ప్రాంతాల్లో మాసూళ్లు పూర్తయ్యాయి.
కాకినాడ జిల్లా కాజులూరు, తాళ్లరేవు, కాకినాడ గ్రామీణంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కోనసీమలోనూ వరి కోతలు జోరుగా కొనసాగుతున్నాయి. వారం పది రోజులుగా గోనె సంచులు రైతులకు అందక పోవడంతో పొలం గట్లు, పుంత రహదారులపై ధాన్యం ఆరబెడుతున్నారు. ఒకవేళ సంచులు సరఫరా చేసినా..అవి కన్నాలు పడి ఉంటున్నాయని..వాటిలో రవాణా చేయడం వల్ల నష్టపోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు.
కోనసీమ జిల్లాలో లక్షా 90 వేల ఎకరాలకు గాను సుమారు 45 వేల ఎకారాల్లో పంట విరామం ప్రకటించారు. మిగిలిన లక్షా 45 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. లక్షా 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా..52 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 2 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పంట రైతుల వద్దనే ఉంది. ఓ వైపు రబీ సీజన్ ప్రారంభమయింది. ఈ ధాన్యం ఎప్పటికి కొంటారో తెలీని పరిస్థితుల్లో సాగుదారులు సతమతవుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేటలో రైతులు ఆందోళన చేపట్టారు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వలన తీవ్రంగా నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షంపాలు కాక ముందే తమకు న్యాయం చేయాలని... పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అన్నదాతలు వేడుకుటుంటున్నారు.
ఇవీ చదవండి: