తూర్పుగోదావరి జిల్లాలో గత రెండు మూడేళ్లుగా ఏర్పాటైన సూక్ష్మ- చిన్న- మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) 501 ఉన్నాయి. వీటికి ప్రభుత్వం రాయితీల రూపంలో ప్రోత్సాహకం కింద రూ. 92.65 కోట్లు మంజూరుచేసింది. ఈ నిధుల్లో మొదటి విడతలో రూ.41.74 కోట్లు విడుదలయ్యాయి. ఈ సొమ్ము సంబంధితుల ఖాతాల్లో జమైనట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన సొమ్ము రెండో విడతగా ఈనెల 29న విడుదల కానుంది.
రీస్టార్ట్ ప్యాకేజీ పేరిట ప్రతి ఎంఎస్‌ఎంఈలకు ఫిక్స్‌డ్ డిమాండ్ ఎలక్ట్రికల్ ఛార్జీల చెల్లింపుల విషయంలో ఊరట కల్పించింది. వాస్తవంగా పరిశ్రమలకు నిర్దేశించిన ఫిక్స్‌డ్ ఛార్జీలను అదనంగా ఖర్చు చేసిన విద్యుత్తుకు చెల్లించాల్సి ఉంటుంది. కరోనా విపత్తును దృష్టిలో పెట్టుకుని 3 నెలల ఫిక్స్‌డ్ విద్యుత్తు ఛార్జీలను మాఫీ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో 6,499 ఎంఎస్‌ఎంఈలు లబ్ధి పొందనున్నాయి. జిల్లాలోని 65 భారీ, పెద్ద పరిశ్రమలకు ఈ విద్యుత్తు రుసుముల చెల్లింపులకు 3 నెలల గడువు ఇచ్చారు. దీనికి ఆయా పరిశ్రమల నుంచి ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ విషయంలో జిల్లాలో 8,271 సూక్ష్మ- చిన్న- మధ్యతరహా పరిశ్రమలు ఉంటే దరఖాస్తు చేసుకున్నవారు వెయ్యి దాటలేదు.
కష్ట కాలంలో ఊరట
పెట్టుబడి నిధికి రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తీసుకున్నవారికి 6 నెలల మారటోరియం ప్రకటించారు. కష్టకాలంలో వాయిదాలు కట్టేలా ఒత్తిడి లేకుండా రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా ఈ వెసులుబాటు కల్పించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రీస్టార్ట్ ప్యాకేజీలో 20 శాతం అదనపు రుణాలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. రూ. కోటి రుణం తీసుకుంటే.. రూ. 20 లక్షలు అదనంగా పొందే వీలుంది. పెట్టుబడి నిధి కింద జిల్లాలో 8,167 యూనిట్లకు అర్హత ఉంది. కొవిడ్ సమయంలో పరిశ్రమల్లో ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యంలేక నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఉత్పత్తుల్లో 25శాతం ప్రభుత్వమే కొనుగోలుచేసి.. అందుకు సంబంధించిన సొమ్ము 45 రోజుల్లో చెల్లిస్తామని ప్రకటించడం ఊరటనిచ్చిన అంశం.
మన్యంలో అధ్యయనం..
తూర్పు మన్యంలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. 4.50 లక్షల మంది జనాభా స్థానిక వనరులను నమ్ముకుని ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు.. సంబంధిత నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే దిశగా చర్యలు మొదలయ్యాయి. తాజాగా చింతూరు ఐటీడీఏలో ప్రాజెక్టు అధికారి ఆకుల వెంకట రమణ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, బ్యాంకు మేనేజర్లతో సమీక్ష నిర్వహించి పారిశ్రామిక ప్రగతికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేస్తున్నారు. గిరిజన ఉత్పత్తుల నిల్వకు శీతల గిడ్డంగులు ఏర్పాటు. ఫ్లై యాష్ బ్రిక్స్, చిల్లీ పౌడర్, థస్సార్ సిల్క్ (పట్టు దారం), తేనె, వెదురు, జీడిపిక్కల ఆధారిత పరిశ్రమల ఏర్పాటు దిశగా సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పపువ్వుతో అద్దకం రంగులు, పోషకాహార ఆధారిత ఉత్పత్తుల దిశగానూ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
జిల్లాలో పారిశ్రామిక చిత్రం
జిల్లాలో భారీ, పెద్ద పరిశ్రమలు - 65 (భారీ పరిశ్రమలు: 8, పెద్ద పరిశ్రమలు: 57)
భారీ, పెద్ద పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నవారు: 31,663
జిల్లాలో సూక్ష్మ- చిన్న- మధ్యతరహా పరిశ్రమలు: 8,271
ఎంఎస్‌ఎంఈల్లో ఉపాధి పొందుతున్నవారు : 84,490
ఇవీ చదవండి...
జిల్లాలో కరోనా విజృంభణ... కంటైన్మెంట్ వ్యూహం అమలుకు సన్నాహాలు