పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో... తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానల ధాటికి జనజీవనం స్తంభించింది. గడచిన 24 గంటల్లో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్ర హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, ఐటీడీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటుచేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అధికారులందరూ అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజా పరిస్థితిపై జిల్లా సంయుక్త కలెక్టర్ డా.లక్ష్మీషా సమీక్షించారు. అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా చూస్తామని చెప్పారు. ముందస్తు చర్యగా కాకినాడ, ఉప్పాడ బీచ్‌రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు.
రాజమహేంద్రవరం డివిజన్లో...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... రాజమహేంద్రవరం డివిజన్లోని అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ సబ్ కలెక్టర్ అనుపమ అంజలి ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధిక వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైనా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా హెల్ప్‌లైన్ నెంబర్ 98499 09695కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
డివిజన్ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆలమూరు 98499 03902, గోకవరం 80088 03194, కడియం 98499 03901, కోరుకొండ 80080 03195, రాజమహేంద్రవరం రూరల్ 98499 03860, రాజమహేంద్రవరం అర్బన్ 98499 03898, రాజానగరం 98499 03900, సీతానగరం 80088 03192 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి: