గత నెలలో 15రోజులకు పైగా తీరాన్ని గడగడలాడించిన గోదారమ్మ మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 13 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. సముద్రంలోకి 11 లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. డెల్టా కాల్వలకు 8వేల 700 క్యూసెక్కులు విడుదల చేశారు. ఈ వరద అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సోమవారం ఉదయానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరిలో 50.1 అడుగలకు నీటిమట్టం చేరుకుంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.
మేడిగడ్డ జలాశయం నుంచి వరద నీటిని విడుదల చేశారు. ఇంద్రావతి, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో, ఆంధ్రా, ఒడిషా సరిహద్దుల్లోనూ విస్తారంగా వానలు కురవడం, సీలేరు, డొంకరాయి జలాశయాల నుంచి భారీగా వరదనీరు రావడం వల్ల... గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. విలీన మండలాలు మళ్లీ ముంపు బారిన పడ్డాయి.
జలదిగ్బంధంలో పలు మండలాలు
దేవీపట్నం మండలంలో 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమలోని 16 మండలాలు మళ్లీ వరదల్లో చిక్కుకున్నాయి. 2 రోజుల క్రితం పి.గన్నవరం మండలం చాకలి పాలెం సమీపంలో కాజ్వే మునిగిపోయింది. కనకాయలంక, జి.పెదపూడి లంక గ్రామాల ప్రజలు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంను వరద నీరు చుట్టుముట్టింది. గోదావరిలో రాకపోకలు సాగించవద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
రాకపోకలు నిలిపివేత
విలీన మండలాలైన కూనవరం, వీఆర్‌పురంలను గోదావరి వరదలు ముంచెత్తుతున్నాయి. రెండు మండలాలకు బాహ్య ప్రపంచంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కూనవరం మండలం కూళ్లపాడు, దూగుట్ట, కొండాయిగూడెం, కాసవరం గ్రామాల్లో... సుమారు 800 ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. పోలిపాక, కోండ్రాజుపేట కాజ్‌వేలపై వరదనీరు ప్రవహించటం వల్ల సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. చింతూరు-వీఆర్‌పురం మధ్య 4 ప్రాంతాల్లో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీఆర్‌పురం మండలంలో 4వేల ఎకరాల్లో వరి నీటి ముంపునకు గురైంది.
ఇదీ చూడండి: మళ్లీ పోటెత్తుతోన్న ఉగ్రగోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక