Danger Road In Annamayya District: పేరుకేమో జాతీయ రహదారి కానీ ఆ మార్గంలో ఆదమరిచి ప్రయాణిస్తే ఆ ఘడియే జీవితానికి ఆఖరి. అడుగుకో గుంతతో ప్రమాదాలకు నెలవుగా మారిన ఆ మార్గంలో ప్రయాణమంటనే జనం జంకుతున్నారు. ఈ ఏడాది ఆ మార్గంలో 90మందికిపైగా మృత్యువాత పడ్డారు. అంతే సంఖ్యలో గాయపడ్డారు. ఇదీ అన్నమయ్య జిల్లాలోని ప్రధాన రహదారి పరిస్థితి.
భయానకంగా రోడ్లు: అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ప్రధాన రహదారి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో గోతులమయమైంది. కడప నుండి తిరుపతి వరకు 100 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ జాతీయ రహదారి అడుగడుగున గోతులు వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రహదారిపై ప్రయాణించాలంటే ఎక్కడ తమ ప్రాణాన్ని ఈ రోడ్డు బలి గొంటుందోనంటూ వాహనదారులు బంబేలు ఎత్తుతున్నారు. రాత్రి సమయాలలో ద్విచక్ర వాహనంలో పోవాలంటే భయపడుతున్నారు.
ప్రధాన రహదారుల ముఖచిత్రం: గత నెల రోజులుగా వర్షాలు పడుతుండటంతో రోడ్డు ఎక్కువగా దెబ్బతింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు గోతులకు కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదు. దీనివలన ప్రధాన రహదారి ప్రమాదాలతో రక్తసిక్తం అవుతుంది. రాజంపేట నుంచి తిరుపతి వరకు ప్రధాన రహదారి చిత్రమై ఉంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట, ఓబులవారిపల్లి క్రాస్, కొర్లకుంట, మంగంపేట, అనంతరాజుపేట, కోడూరు శాంతినగర్, మైసూరవారిపల్లి, జ్యోతి నగర్ కాలనీ, మాధవరం పోడు, సెట్టిగుంట, కుక్కల దొడ్డి గ్రామాల గుండా పోతున్న ప్రధాన రహదారిలో ఒక గంటలో ప్రయాణించాల్సిన వాహనదారుడు రెండు మూడు గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ గతుకుల్లో పడ్డ వాహనాలు టైర్లు పేలి వాహనాలు దెబ్బతింటున్నాయి.
గత కొంతకాలంగా ఈ రోడ్డుపై అనేక రకాలైన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రైల్వే కోడూరు మండలంలో మైసూరవారిపల్లి పంచాయతీ, రాజా నగర వద్ద కారు ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. మూడు రోజుల క్రితం ఓబులవారిపల్లె మండలం, రెడ్డిపల్లి చెరువు కట్టపై ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురై చనిపోయారు.
రహదారులన్నీ రక్తసిక్తం: గత 2024 లో రైల్వేకోడూరు మండలంలో 39 రోడ్డు ప్రమాదాల జరగా 29 మంది చనిపోగా 52 మందికి పైగా గాయపడ్డారు. ఓబులవారిపల్లె మండలంలో 24 ప్రమాదాల్లో 13 మంది చనిపోగా 27 మందికి పైగా గాయపడ్డారు. చిట్వేలు మండలంలో 11 రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోగా 15 మందికి పైగా గాయపడ్డారు. పుల్లం పేట మండలంలో 18 మంది చనిపోగా 9 మంది గాయాలపాలయ్యారు. 14 మందికి పైగా గాయపడ్డారు. రాజంపేట మండలంలో 14 రోడ్డు ప్రమాదాల్లో 16 మంది చనిపోయారు ఈ విధంగా పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. ఒకవైపు రోడ్డు గతుకులు, వాహనదారులు అతివేగం కూడా ఈ ప్రమాదాలకు దారితీస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.
''మాది అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు మండలం ఎస్. ఉప్పలపల్లి గ్రామం. ఇక్కడ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఒక్కసారైనా చంద్రబాబు, లోకేశ్,పవన్ కల్యాణ్ ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చి ఉంటే ఈ ప్రాంతానికి వెంటనే రోడ్లు వేయించేవారు. అంత దారుణంగా ఈ రోడ్ల పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం దీనిపై స్పందించి రోడ్లు వేయించాలని కోరుతున్నాం''-రామసుబ్బారెడ్డి, రైల్వే కోడూరు
పల్నాడు జిల్లాలో చెట్టును ఢీకొట్టిన కారు - ముగ్గురు మృతి - Road accident in Palnadu district
చెర్లోపల్లి వద్ద రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి
వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు - ఆరుగురు మృతి - TODAY ROAD ACCIDENTS IN AP