Burden Of Debt On The Farmer's Family: తలసరి రుణ భారంలో ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబంపై 2 లక్షల 45 వేల 554 అప్పు ఉన్నట్లు.. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించారు. శుక్రవారం రాజ్యసభలో ఆప్ సభ్యుడు సంజయ్‌సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. జాతీయ స్థాయిలో ప్రతి రైతు కుటుంబం మీద 74వేల 121 రూపాయల భారం మాత్రమే ఉండగా, ఏపీ రైతులపై అంతకు మూడురెట్ల భారముంది.
ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానంలో కేరళ, పంజాబ్ నిలిచాయి. రైతు కుటుంబం తలసరి అప్పు 2లక్షలు దాటిన రాష్ట్రాలు ఈ మూడే ఉన్నాయి. తెలంగాణలో ప్రతి రైతు కుటుంబంపై లక్షా 52వేల 113 మేర రుణభారముంది. రైతులపై అత్యధిక అప్పున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది.
దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల సగటు ఆదాయం 10వేల 218 రూపాయలతో పోలిస్తే ఏపీ రైతు కుటుంబాల ఆదాయం 10వేల 480గా ఉంది. 2.56 శాతం ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ.. అప్పు మాత్రం దాదాపు మూడురెట్లు అధికంగా ఉంది. తెలంగాణ రైతుల మీద కూడా జాతీయ సగటుకంటే రెండు రెట్ల అప్పు ఎక్కువగా ఉన్నా.. అక్కడి రైతుల నెలవారీ ఆదాయం 9వేల 403 రూపాయలు మాత్రమే. ఇది జాతీయ సగటు ఆదాయం కంటే 7.9శాతం తక్కువ. రైతు కుటుంబాల ఆదాయమంటే.. కేవలం పంట దిగుబడుల ద్వారా వచ్చింది మాత్రమే కాదని.. వేతనాలు, భూముల లీజు, పశుపోషణ, ఇతరత్రా వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా వచ్చిందని కేంద్రమంత్రి వివరించారు.
2008-09లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీ, రుణ ఉపశమన పథకం అమలు చేసిందని, ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ రుణమాఫీ అమలు చేయలేదని చెప్పారు. రైతులపై రుణభారాన్ని తగ్గించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా.. ఒక్కో రైతు కుటుంబానికి ఏటా 6 వేలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఒక్కో రైతు కుటుంబంపై సగటున లక్షకు పైగా రుణభారం ఉన్న రాష్ట్రాలు 8 ఉండగా, అందులో దక్షిణాది నుంచి నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. అందులోనూ మిగతా రాష్ట్రాలకంటే తెలుగు రాష్ట్రాల్లోని రైతుల కుటుంబాల ఆదాయం అతితక్కువగా ఉంది. అత్యంత వెనుకబడినవిగా చెప్పుకొనే ఈశాన్య రాష్ట్రాల్లో సగటు రైతు కుటుంబాల నెలవారీ ఆదాయం 16వేల 863 రూపాయలు, సగటు రుణభారం 13వేల 642 రూపాయలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆ విషయాల్లోనూ ఈశాన్య రాష్ట్రాల కంటే వెనుకబడ్డాయి..
ఇవీ చదవండి: