తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట, పోతవరం పునరావాస కాలనీలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న దేవీపట్నం మండలంలో 44 గ్రామాలకు సంబంధించి ఇప్పటికే 80 శాతం కాలనీ నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. మిగతా 20 శాతం కాలనీలను త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
అలాగే వరదలు వస్తున్న కారణంగా తమకు కేటాయించిన కాలనీలకు 15 రోజుల్లో తరలి వెళ్లాలన్నారు. గృహాలు పూర్తి కాని వారు ఎక్కడైనా అద్దెకు ఉండాలని.. వారి అద్దెకూడా సంవత్సరానికి 36వేలు ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. లబ్ధి దారులకు ప్యాకేజి మొత్తం 15 రోజుల్లో చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ మురళీధర్ రెడ్డి వెల్లడించారు.
అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రత్యేక అధికారి ఆనంద్, ఐటీడీఎ పీఓ ప్రవీణ్ ఆదిత్య, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్, రంపచోడవరం ఎఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు.