తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలోని టైకి ఫార్మా పరిశ్రమలో.. రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాళ్లరేవు మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం, వెంకటరమణ అక్కడిక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. టైకి పరిశ్రమలో ఔషధాల ముడిపదార్థం తయారు చేసి.. అమెరికాకు ఎగుమతి చేస్తుంటారు. రోజూ మాదిరిగానే కార్మికులు విధుల్లో ఉండగా.. నైట్రిక్ ఆమ్లంతో వేరే రసాయనాలు కలిపే క్రమంలో.. ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగి రియాక్టర్‌లో పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు.
ప్రమాదంపై మంత్రి కన్నబాబు ఆరా తీశారు. పరిశ్రమ ప్రతినిధులు సరైన సమాధానం చెప్పకపోవడంతో, ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలిని పరిశీలించారు.
ఘటనాస్థలిని తెలుగుదేశం ఎమ్మెల్యే చిన్నరాజప్ప పరిశీలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కోటి, గాయపడ్డ వారికి 10 లక్షల చొప్పున పరిశ్రమ చెల్లించాలని, ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు టైకి పరిశ్రమ నుంచి వెడుతున్న వ్యర్థాలతో పంట కాల్వలూ కాలుష్యం బారిన పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: