తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. హిందూ సంఘాలే కాకుండా పలు రాజకీయ పార్టీలు సైతం నిరసనలు తెలుపుతున్నాయి. ఈ తరుణంలో రథం దగ్ధమైన ఘటనను వ్యతిరేకిస్తూ భాజపా, జనసేన పార్టీలు చలో అంతర్వేదికి పిలుపునిచ్చాయి. రాజోలులో భాజపా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి మానేపల్లి అయ్యాజీ వేమాను గృహ నిర్బంధం చేశారు.
కొత్తపేటలో రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యుడు సత్యానందం, రావులపాలెంలో భాజపా గుంటూరు జిల్లా పదాధిపతి రామకృష్ణారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. సెక్షన్ 30 అమలు కారణంగా.... అంతర్వేది వచ్చేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. కోనసీమతో పాటు కాకినాడ, రాజమహేంద్రవరంలోని నేతల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. నిన్న చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొన్న 43 మంది నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
అంతర్వేది ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఆలయం వద్ద నిన్న జరిగిన ఉద్యమంలో నినాదాలు చేస్తున్నారనే కారణంతో యువకులను, మహిళలను అరెస్టు చేశారన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతర్వేది రథం దగ్ధం ఘటనను భాజపా నాయకురాలు యామిని శర్మ ఖండించారు. అంతర్వేదికి వెళ్తున్న యామినిని.. పాలకొల్లు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. హిందూ దేవాలయాలను కాపాడాలని నిరసన తెలిపేందుకు వచ్చిన తమను అడ్డుకోవడం దారుణమన్నారు.
ఇదీ చదవండీ... 'రథం దగ్ధంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి'