YSRCP government utter neglect of irrigation Projects: అధికారంలోకి వస్తే ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి, కొత్తగా లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టిస్తానంటూ ఊరూవాడా ఊరించే మాటలు చెప్పారు జగన్. కానీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఉసూరుమనిపించారు. కృష్ణా జలాలను మళ్లించి సీమ జిల్లాలకు సాగు, తాగు నీరందించే బృహత్ సంకల్పంతో చేపట్టిన హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి తొలిదశ పనులు గతంలోనే పూర్తయ్యాయి. కానీ తొలి దశలో నిర్దేశించిన పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి వివిధ దశల్లో ఎత్తిపోసిన నీటిని లక్షా 98వేల ఎకరాల ఆయకట్టుకు మళ్లించడం హంద్రీ నీవా తొలిదశ లక్ష్యం. ఇందులో భాగంగా కృష్ణగిరి జలాశయంలో 0.161 టీఎంసీలు, పత్తికొండ జలాశయంలో 1.216 టీఎంసీలు, జీడిపల్లి జలాశయంలో 1.686 టీఎంసీల నీటిని నిల్వ చేసి కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలకు, అనంతపురం జిల్లాలో 1.18 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాల్సి ఉంది. మొత్తం 14 టీఎంసీలు వినియోగించేలా ఈ పథకం నిర్మించారు.
నాలుగున్నరేళ్లలో కొత్తగా ఉప కాలువలు, పిల్ల కాలువలు తవ్వకపోగా, గతంలో నిర్మించిన ప్రధాన కాలువల నిర్వహణకూ జగన్ ప్రభుత్వం నీళ్లొదిలింది. వాటిల్లో ముళ్లకంపలు, పిచ్చిమొక్కలు పెరిగిపోయి మట్టి పూడుకుపోయింది. నీరు వదిలినా ముందుకు పారే పరిస్థితి లేదు. కొన్నిచోట్ల రైతులే ప్రధాన కాలువల వెంబడి మోటార్లు బిగించుకొని, పైపుల ద్వారా నీటిని తోడి పోసుకుంటున్నారు. ఇందుకు వేలల్లో ఖర్చు భరిస్తున్నారు. చాలాచోట్ల పంపిణీ కాలువలకు లైనింగ్ లేదు. రైతులు, పశువులు దాటడానికి వంతెనలు నిర్మించలేదు. తాత్కాలిక పనులకు మరమ్మతులు చేయాలన్న స్పృహ ప్రభుత్వానికి లేదా అని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నిండుగా నీళ్లున్న సందర్భాల్లోనూ పొలాలు బీళ్లుగానే పడి ఉంటున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మతులు లేక కొట్టుకుపోతున్న గేట్లు
హంద్రీ నీవా తొలి దశలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షా 18వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. అందులోని ఒక ప్యాకేజీలో 20వేల 574 ఎకరాలకు నీళ్లిచ్చేలా కాలువల తవ్వకం పనులకు 2004లోనే టెండర్లు ఖరారయ్యాయి. అప్పట్లో పూర్తి చేయకపోవడంతో 2016-17లో మళ్లీ టెండర్లు పిలిచారు. 2019 మే నాటికి దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లుగా ఎలాంటి పురోగతీ లేదు. ఇదే జిల్లాలో మరో ప్రాజెక్టు కింద 80వేల 600 ఎకరాలకు నీరివ్వాలన్నది ప్రణాళిక. 2019 నాటికి మిగిలి ఉన్న పనిని రెండు ప్యాకేజీలుగా విడగొట్టి టెండర్లు పిలిచినా, పనులు పూర్తికాలేదు. పత్తికొండ జలాశయం కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 61 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో దాదాపు 40 వేల ఎకరాలకు నీరందించలేకపోతున్నారు.
జగన్ మాటలకు చేతలకు పొంతన కరవు-అటకెక్కిన డ్రోన్ పంపిణీ ప్రాజెక్టు
గాలేరు నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా కృష్ణా జలాలను గండికోట రిజర్వాయర్‌కు తరలించి, అక్కడి నుంచి పలు ప్రాజెక్టుల ద్వారా పొలాలకు మళ్లించాలన్నది ప్రణాళిక. తొలి దశలో గండికోట నుంచి సర్వారాయసాగర్, వామికొండ సాగర్‌కు మళ్లిస్తే 35 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. కానీ, నీళ్లు ఉన్నప్పుడు కేవలం 6వేల 500 ఎకరాలకు ఇవ్వగలుగుతున్నారు. మిగిలిన ఆయకట్టుకు నీళ్లు చేరేలా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేదు. గండికోట నుంచి ఐదు దశల్లో చిత్రావతికి 8.3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ 12 వేల ఎకరాల ఆయకట్టును వినియోగంలోకి తేవాలన్నది ప్రణాళిక. ఇక్కడా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తి కాలేదు. చిత్రావతి జలాశయానికి తరలించిన నీటిని లింగాల కుడి కాలువ, పులివెందుల బ్రాంచి కాలువ ద్వారా ఆయకట్టుకు చేర్చాలి. ఇక్కడా డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు నిర్మించలేదు. చిత్రావతి నుంచి లింగాల కుడి కాలువ ద్వారా 30 వేల ఎకరాలకు గ్రావిటీ ద్వారా పారుతోంది. ఈ కాలువపై 23 చోట్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించి అక్కడి నుంచి చెరువులు, చెక్ డ్యాంలకు నీటిని తోడిపోయాలి. వాటి నుంచి డిస్ట్రిబ్యూటరీలు తవ్వాలన్నది ప్రణాళిక. ఆ నీటిని సంపుల్లో నింపి సూక్ష్మ పారుదల విధానాల ద్వారా సాగును ప్రోత్సహించాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ అంతా చెరువులు నింపడం, భూగర్భ జలాలు పెరిగితే పైపులతో తోడుకోవడం తప్ప, ప్రత్యక్షంగా నీటి పంపిణీ లేదు. లింగాల కాలువ కింద 39వేల 400 ఎకరాలకు, పైడిపాలెం కింద 37వేల 500, పులివెందుల బ్రాంచి కింద 45,500 ఎకరాలకు సూక్ష్మ సేద్యం కింద నీళ్లివ్వాల్సి ఉన్నా ఇంకా పనులు పూర్తి చేయలేదు. ఈ మూడు కాలువల కింద సింహభాగం పరోక్ష ఆయకట్టుగానే రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. పులివెందుల బ్రాంచి ఆధునికీకరణ పనుల్లోనూ వేగం లేదు. పైడిపాలెం కింద కాలువల వ్యవస్థ ఏర్పాటు కాలేదు. మైలవరం జలాశయం కింద కాలువలు పూర్తిస్థాయిలో తవ్వలేదు.