Suicide: చిత్తూరు జిల్లా కుప్పం గంగమాంబ ఆలయ మాజీ ఛైర్మన్, వైకాపా నేత పార్థసారథి ఆత్మహత్య తీవ్ర దుమారం రేపుతోంది. ఛైర్మన్ పదవి కోసం నేతలకు ఇచ్చిన సొమ్ముతో పాటు ఆలయ అభివృద్ధి కోసం చేసిన అప్పులు తీర్చడం ఇబ్బందిగా మారడంతో పాటు.. అవమానకరంగా ఛైర్మన్ పదవి నుంచి తప్పించడంతోనే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందంటూ..పార్థసారథి తీసుకొన్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. రెస్కో ఛైర్మన్ సెంథిల్, ఆయన సోదరుడు ఒత్తిడి వల్లనే తన అన్న చనిపోయాడని..మృతుని సోదరుడు ఆరోపిస్తున్నారు.
అప్పులకు వడ్డీ కట్టలేక.. ఆలయ ఛైర్మన్ పదవి కోసం రూ.15 లక్షలు వైకాపా నేతలకు ఇచ్చానని.. బోర్డు ఏర్పాటుకు రూ.10 లక్షలు, గుడి అభివృద్ధి కోసం మరో పది లక్షలు ఖర్చు పెట్టానని.. సెల్పీ వీడియోలో పార్థసారథి వివరించారు. మొత్తం రూ.35 లక్షల అప్పులకు వడ్డీ కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయారు. కరోనాతో రెండేళ్లుగా నిలిచిన జాతరను నిర్వహించి తాను తప్పుకుంటానని చెప్పినా వినకుండా.. అవమానకరంగా తప్పించారని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో స్పష్టంచేశారు.
సంబంధం లేని వ్యక్తులకు ఛైర్మన్ పదవి అమ్ముకొన్నారు.. గంగమాంబ ఆలయ నూతన కమిటీ గురువారం పదవీ ప్రమాణం చేస్తుండగా అదే రోజు పార్థసారథి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు ఛైర్మన్ పదవి అమ్ముకొన్నారని..7 సంవత్సరాల పాటు పార్టీకి సేవచేసిన తన అన్న నుంచి లక్షల రూపాయల మేర డబ్బులు తీసుకుని.. తర్వాత పక్కన పెట్టేశారని పార్థసారథి తమ్ముడు కార్తీక్ చెబుతున్నారు. తన అన్న మృతికి వైకాపా నేత, రెస్కో ఛైర్మన్ సెంథిల్, ఆయన సోదరుడు ప్రధాన కారణమని ఆవేదన వ్యక్తంచేశారు.
పార్థసారథి మృతిపై అనుమానాలు.. గంగమాంబ మాజీ ఛైర్మన్ పార్థసారథి మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించమని ప్రకటించారు. పార్థసారథి మృతదేహాన్ని వైకాపాకు దానం చేస్తున్నామని.. మృతదేహాన్ని తీసుకొనే ప్రసక్తే లేదని బంధువులు తెలిపారు.
ఇదీ చదవండి:
Baby at roadside: "నేనేం పాపం చేశానమ్మ... నన్నేందుకు ఇక్కడ వదిలేశారు"