ప్రసవ వేదనతో 108 వాహనంలో ఆస్పత్రికి వెళుతూ అందులోనే మహిళ ప్రసవించిన సంఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కార్వేటినగరం మండలం ఎర్రంరాజుపల్లి కి చెందిన గర్భిణి శుభశ్రీ పురిటి నొప్పులతో కాన్పు కోసం.. పచ్చికాపలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. గర్భిణిని పరిశీలించిన వైద్యులు కాన్పు కష్టమయ్యే అవకాశం ఉందని.. వెంటనే తిరుపతి ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లమని సిఫార్సు చేశారు.
108 వాహనంలో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. గర్భిణి ప్రసవ వేదనను గమనించిన 108 వాహన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సుఖ ప్రసవం చేసి పండంటి ఆడబిడ్డకు పురుడు పోశారు. అనంతరం తల్లి బిడ్డను పరీక్షించి క్షేమంగా ఉన్నట్లు తెలిపి, తిరుపతి ప్రసూతి వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి: బ్రిటన్ నుంచి వచ్చినవారి కోసం గాలింపు