నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో జులై నెల మొదటి వారం నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో జులై నెలలో సాధారణ వర్షపాతం 101.9 మి.మీటర్లు కాగా.. 203.4 మి.మీటర్లు అధికంగా కురిసింది. రామచంద్రాపురం మండలంలో సాధారణానికి మించి అధికంగా 279.4 మి.మీటర్ల వర్షం పడింది. రామచంద్రాపురం, చిత్తూరు, తిరుపతి గ్రామీణ, పాకాల, తవణంపల్లె, వి.కోట, ఐరాల, ములకలచెరువు, నారాయణవనం, పలమనేరు, గంగవరం అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని మండలాల్లోను 100-170మి.మీటర్ల వరకు అధిక వర్షం కురిసింది.
- 20.89 మీటర్లలో భూగర్భ జలమట్టం
ఈ ఏడాది కురిసిన కుండపోత వర్షాల కారణంగా చెరువులు, కుంటలు, బావులు నిండటంతో భూగర్భ జలమట్టం పెరిగింది. గతేడాది జులై చివరి నాటికి 29.60 మీటర్లలో నీటి లభ్యత ఉండగా.. ఈ ఏడాది 20.89 మీటర్లకు తగ్గింది. ఆగస్టులో కూడా వర్షాలు కురుస్తున్నందున భూగర్భ జలాలు తక్కువ లోతులోనే లభ్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మదనపల్లె డివిజన్‌లోనే జలమట్టం ఎక్కువ లోతులోనే ఉంది. డివిజన్‌లోని గుర్రంకొండలో జులై చివరి నాటికి 77.04 మీటర్లలో నీరు లభ్యమవుతోండగా.. సదుం మండలంలో 9.32 మీటర్లలోనే జలవనరులున్నాయి. చిత్తూరు డివిజన్ ఐరాల మండలంలో అత్యధికంగా 54.14 మీటర్లలో లభ్యమవుతుండగా.. తక్కువగా పాకాల మండలం దామలచెరువులో 4.72 మీటర్లలో లభిస్తున్నాయి. తిరుపతి డివిజన్‌లో పిచ్చాటూరులో అత్యధికంగా 16.96 మీటర్లు, తక్కువగా వడమాలపేటలో 3.07 మీటర్లలో లభ్యమవుతున్నాయి.
ఇదీ చదవండి: ఆరు నెలల్లోనే మరో ఐపీఎల్.. అదే ఆటగాళ్లతో టోర్నీ!