మూడు రాజధానులకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెదేపా నేతలు ధర్నా చేపట్టారు. తిరుపతి పార్లమెంట్ ఇంచార్జ్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేశారు. రాజధాని రైతుల గోడు వినాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఒక్క రాజధాని నిర్మించలేని వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
'సేవ్ అమరావతి' నినాదంతో 365 రోజులుగా రైతులు చేపట్టిన దీక్షకు మద్దతుగా పుత్తూరులో తెదేపా నాయకులు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజధానిగా అమరావతి ఉండాలనే సంకల్పంతో ఆ ప్రాంత రైతులు 33 వేల ఎకరాల భూములను నాటి ప్రభుత్వానికి అప్పగించారని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విచ్చిన్నం చేయడానికి నేటి సర్కారు ప్రయత్నిస్తోందని అన్నారు. వందమందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. మృతిచెందిన రైతులకు ఆత్మశాంతి చేకూరాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తిరుమల కొండపై అన్యమత ప్రచారం వాహనం..!