రాయితీల కోతతో పాటు విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం మరమగ్గాల కార్మికుల పాలిట శాపంగా మారింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలో మరమగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికుల కుటుంబాలపై విద్యుత్ ఛార్జీల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరి నియోజకవర్గంతో పాటు నారాయణవనం మండలాల్లో దాదాపు 16 వేల కుటుంబాలు మరమగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. గత రెండేళ్లుగా కరోనా వల్ల వ్యాపారం లేక నష్టపోయారు. సాధారణ పరిస్థితులు నెలకొని.. వ్యాపారాలు పుంజుకొంటున్న సమయంలో కరెంటు ఛార్జీలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని నేతన్నలు వాపోతున్నారు.
మరమగ్గాలపై కుటుంబం మొత్తం నెల రోజుల పాటు కష్టపడితే 10వేల రూపాయలు ఆదాయం వస్తుందని.. దానిలో 3, 4వేల రూపాయలు విద్యుత్ ఛార్జీలకే చెల్లించాల్సి వస్తోందని నేత కార్మికులు వాపోతున్నారు. అధికారంలోకి వస్తే 500 యూనిట్ల వరకు ఉచితంగా మరమగ్గాలకు విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీ అమలు చేయకపోగా.. ఛార్జీలు పెంచారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమగ్గాలకు విద్యుత్‌పై గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీ సైతం తొలగించారని వాపోతున్నారు. ఈడీ ఛార్జీల పేరుతో తమ కడుపు కొడుతున్నారని వాపోతున్నారు.
మరమగ్గాలపై యూనిట్ కు 94 పైసలు పెంచడంతో... గతంతో పోలిస్తే రెట్టింపు కరెంటు బిల్లులు వస్తున్నాయని నేత కార్మికులు వాపోతున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన బాట పడుతున్నారు.
ఇవీ చూడండి
కాషాయమయంగా విజయవాడ రోడ్లు..బులెట్లపై భారతమాత వేషధారణలో మహిళలు
ఒంగోలు మహానాడు తీర్మానాలకు తెదేపా పొలిట్ బ్యూరో ఆమోదం
మెకానిక్‌లా వచ్చి ఆర్టీసీ బస్సు చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్