భారతీయ జనతాపార్టీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని కోరుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించారు. తొలుత ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కు భాజపా-జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ్నుంచి నేరుగా ఎమ్మార్ పల్లి కి చేరుకుని పాదయాత్రను ప్రారంభించారు. ఒక దశలో భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు, కార్యకర్తలను అదుపుచేయడం పోలీసులకు సాధ్యంకాక ఒక దశలో స్వల్ప లాఠీ ఛార్జీ చేశారు. ఫలితంగా పవన్ తన పాదయాత్రను విరమించుకుని వాహనంలోనే శంకరంబాడీ కూడలికి చేరుకున్నారు.
గబ్బర్‌సింగ్ డైలాగులు..
బహిరంగ సభలో భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవ్ ధర్ గబ్బర్ సింగ్ డైలాగులు చెప్పి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాష్ట్రంలో వైకాపా గుండా రాజ్యం నడుస్తుందన్న ఆయన.. గబ్బర్ సింగ్ మాత్రమే వాళ్లకు సమాధానం చెప్పగలడన్నారు.
పవన్‌కు ఎర్రకండువా రాఖీ కట్టిన రత్నప్రభ..
భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ.. ఇంటర్నెట్లో ట్రోలింగ్ చేస్తున్నవారిని హెచ్చరించారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చింకుందాం రండి అంటూ వైకాపా నేతలకు సవాల్ విసిరారు. ముందుగా ఎర్రకండువాను పవన్ చేతికి రాఖీలా కట్టిన కూటమి అభ్యర్థి రత్నప్రభ.. తమ్ముడిగా తనకు అండగా ఉండాలన్నారు. పవన్ నటించిన గోపాలగోపాల చిత్రంలోని డైలాగులను చెప్పి అందరినీ ఉత్సాహపరిచారు.
వైకాపాపై ధ్వజమెత్తిన నాదెండ్ల, సోము..
ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించకుండా ఓటెలా అడుగుతారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైకాపాపై ధ్వజమెత్తారు. బహిరంగ సభ అనంతరం భాజపా నాయకులను ఆత్మీయంగా పలకరించిన పవన్.. సభ ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మొత్తం మీద పవన్ పర్యటన అటు భాజపా- ఇటు జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని ఇరుపార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: