చిత్తూరు జిల్లా నర్సరీ రైతులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన పలమనేరు, పీలేరు, మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో దాదాపు రెండు వేల ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో వివిధ రకాల నారులు పెంచే నర్సరీలు ఉన్నాయి. ఈ నర్సరీల్లో జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే టమోటాతో పాటు వంగ, మిరప వంటి కూరగాయల నారులు పెంచుతారు. ఇక్కడ సాగయ్యే నారును జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, షాద్నగర్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. దాదాపు రెండు నెలల పాటు లాక్‌డౌన్ కొనసాగడం వల్ల నారు కొనే రైతులు లేక నర్సరీ యజమానులు బెడ్లపైనే వదిలేశారు.
లక్షల పెట్టుబడి.. 40 రోజుల శ్రమ
సగటున ఒక ఎకరా విస్తీర్ణంలో నారు నర్సరీలు సాగు చేయడానికి రూ.8 లక్షలు పైబడి వ్యయం చేయాల్సి ఉంటుంది. టమోటా నారుకు 30 రోజులు, మిరప వంటి వాటికి 40 రోజుల పాటు శ్రమించి నారు పెంచుతారు. విత్తనాలు నాటాక 30 రోజులు పెరిగిన మొక్కను వారం రోజుల్లోపు రైతులకు విక్రయించాల్సి ఉంటుంది.
ఇబ్బందుల్లో నర్సరీ యజమానులు
సాధారణంగా జనవరి నుంచి జూన్ నెల చివరి వరకు వివిధ రకాలైన నారు పెంచడం ద్వారా నర్సరీ యజమానులు ఉపాధి పొందుతారు. అయితే నారు చేతికి వచ్చే సమయంలో కరోనా లాక్‌డౌన్ ప్రారంభం కావడం వల్ల వీరు తీవ్రంగా నష్టపోయారు. పరిస్థితులు ఎప్పటికీ మెరుగుపడతాయో తెలీని అనిశ్చితి నెలకొనడం వల్ల కొత్తగా నారు సాగు చేయడం లేదు. ఈ క్రమంలో అవసరమైన నారు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తమను ప్రభుత్వం ఆదుకోవాలని నర్సరీ యజమానులు కోరుతున్నారు.
ఇదీ చూడండి..: 4 తరాలు చూసిన కురు వృద్ధుడు: 111 ఏళ్ల వయసులో కన్నుమూత