LOKESH YUVAGALAM PADAYATRA: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 5 రోజులకుగాను 58.5 కిలోమీటర్లు సాగింది. 5వ రోజు ఉదయం పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం కృష్ణాపురం టోల్ గేట్ సమీపంలోని క్యాంపు నుంచి ప్రారంభమైన యాత్ర కస్తూరి నగరం క్రాస్, కైగల్లు, దేవదొడ్డి, బైరెడ్డిపల్లె గ్రామాల మీదుగా కమ్మనపల్లె సమీపంలోని కస్తూరిబా స్కూల్ విడిది కేంద్రం వరకు సాగింది. పాదయాత్రలో అడుగడుగున మహిళలు హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. చిన్నా పెద్దా తేడా లేకుండా లోకేశ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కొమ్మిరిమడుగులో లోకేశ్‌ను కలిసిన అరటి రైతులు తమ బాధలను ఎకరువు పెట్టారు. దేవదొడ్డి వద్ద వరినాట్లు వేసే మహిళా కూలీలను కలిసి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. కస్తూరి నగర్లో సపోటాలు అమ్మే చిరువ్యాపారిని ఆయన పలకరించారు. వీరి సమస్యలు విన్న లోకేశ్ ప్రతి ఒక్కరిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
పాదయాత్రలో బైరెడ్డిపల్లి, వి.కోట మండలాల దాహర్తిని తీర్చే కైగల్ జలాశయాన్ని లోకేశ్ సందర్శించారు. తెదేపా హయాంలో కైగల్ గ్రామంలో 2019లో జలాశయానికి శిలాఫలకం వేశామని గుర్తు చేశారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెదేపా హయాంలో నిధులు కేటాయించి భూ సేకరణ చేస్తే... ఈ ప్రభుత్వం వచ్చాక నిర్వీర్యం చేసిందని లోకేశ్ తెలిపారు. దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదని లోకేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలకు నీళ్లు ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండదు కానీ.. కనిపిస్తే కొండలనైనా మింగేస్తారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించిన యువతను కేసులు పెట్టి లోపల వేసి... అత్యాచారాలు చేసిన వాళ్లు, కల్తీ మద్యం అమ్మిన వాళ్లు, గంజాయి సరఫరా చేసే వాళ్లు బయట తిరుగుతున్నారన్నారు.
బైరెడ్డిపల్లి గ్రామంలో కురబ, బీసీల ఆత్మీయ సమావేశాల్లో లోకేశ్ పాల్గొన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే కురుబల ఉపాధి కోసం ఉపాధి హామీ అనుసంధానించి మినీ గోకులాలు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వ ఖర్చులతో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బీరప్ప ఆలయం అభివృద్ది, నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహాయం చేస్తామని తెలిపారు. కురుబలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడం జగన్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నాడని లోకేశ్ విమర్శించారు.
బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న లోకేశ్‌కు జగన్ పాలనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను బీసీ సంఘాల నాయకులు వివరించారు. బీసీలకు నిధులు లేవని... ఉద్యోగాలు లేవని వాపోయారు. వైకాపా ప్రభుత్వంలో కుల వృత్తులు చేసుకునే వారికి ఎటువంటి ప్రోత్సాహం లేదని తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చాక జనాభా దామాషాలో బీసీలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్ ను పునరుద్దరిస్తామన్నారు. బీసీ, ఎస్సీ సంక్షేమంపై మంత్రులు వేణు గోపాలకృష్ణ, నారాయణస్వామి చేసిన సవాల్‌కు తాను సిద్ధమన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను పెన్షన్, అమ్మ ఒడి ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో చూపించి మోసం చేశారని దుయ్యబట్టారు. బీసీలపై ఈ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్నారు.
ఐదవ రోజు పాదయాత్ర ముగించుకున్న లోకేశ్ కమ్మనపల్లె సమీపంలోని కస్తూరిబా పాఠశాల విడిది కేంద్రంలో బస చేశారు. బుధవారం ఉదయం కమ్మనపల్లె నుంచి రామాపురం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి: