కుప్పం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల మూడు దశల్లో 80 శాతం పైబడి సర్పంచి స్థానాల్లో వైకాపా బలపరచిన అభ్యర్థులు గెలుపొందారని మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. తిరుపతిలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నియోజకవర్గంలోనూ మెజార్టీ స్థానాలను తామే దక్కించుకున్నామన్నారు. మూడో విడతలో 2,574 సర్పంచి స్థానాలు వైకాపాకు దక్కాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం సీట్లను తాము గెలిచామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కుప్పం నియోజకవర్గంలో ఉన్న 89 గ్రామ పంచాయతీలలో 74 గ్రామ వైకాపా ,14 స్థానాల్లో తెదేపా బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారని మంత్రి తెలిపారు.ఈ ఫలితాలు చూశాక చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పోటీచేయాలంటే భయపడుతున్నారని అన్నారు. ప్రజల తీర్పును గౌరవించి ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జగనన్న చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు వైకాపాను గెలిపించారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా.. ఒకసారి ప్రధానమంత్రి కావాలని.. అది తన కోరిక అని వివరించారు.
ఇదీ చూడండి. 'ఫలితాలు తారుమారు చేశారు... చర్యలు తీసుకోండి'