హనుమ జన్మస్థలంపై రెండు రోజుల పాటు అంతర్జాతీయ వెబినార్ నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు వెబినార్‌కు సంబంధించిన వివరాలను ధర్మారెడ్డి మీడియాకు వివరించారు. అంజనాద్రిని హనుమ జన్మస్థానంగా నిర్ధరించేందుకు పండిత పరిషత్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పలు ఆధారాలతో అంజనాద్రిని హనుమ జన్మస్థలంగా గుర్తించినట్లు తెలిపారు. అంజనాద్రే హనుమ జన్మస్థలంగా చెప్పే ఆధారాలతో త్వరలో పుస్తకం తీసుకొస్తున్నట్లు ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల.. హనుమంతుడి జన్మస్థలమని తితిదే ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తితిదే ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. తితిదే పండితులచే ఏర్పాటు చేసిన కమిటీ సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని బలమైన ఆధారాలను సేకరించింది. తితిదే వద్ద ఉన్న ఆధారాలతో రూపొందించిన నివేదికను ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తామని ప్రకటించింది. తాజాగా ఆధారాలతో సహా పుస్తకం తీసుకురానున్నట్లు ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ వెబినార్‌లో పలువురు పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: