చిత్తూరు జిల్లాలో మంగళ, బుధవారాల్లో కురిసిన అకాల వర్షంతో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా పెద్దపంజాణి, వి.కోట, గంగవరం మండలాల్లో టమోటా పంటకు నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో గాలికి వరి పంట, మామిడి కాయలు నేలరాలాయి. వేరుశెనగ, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వడమాలపేట మండలం తట్నేరి గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం వాపోయారు.
పంట నష్టాన్ని అంచనా వేసి.. పరిహారం విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఉద్యానశాఖ డీడీ శ్రీనివాసులు తెలిపారు. అలాగే రామసముద్రం మండలం అనప్పల్లెలోని రెండు వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, మూడు విద్యుత్ స్తంభాలు, మట్లవారిపల్లె ఆలయం వద్ద మరో ట్రాన్స్‌ఫార్మర్, దాసారిరెడ్డిపల్లెలోని ఎస్సీ కాలనీలో ఓ విద్యుత్ స్తంభం నేలకూలింది.
పెద్దపంజాణిలో 68.6 మి.మీటర్ల వర్షం
అల్పపీడనం ఆవర్తనం ప్రభావంతో జిల్లాలోని 61 మండలాల్లో మంగళవారం రాత్రి ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా పెద్దపంజాణి మండలంలో 68.6 మి.మీటర్లు కురవగా.. అత్యల్పంగా బంగారుపాళ్యం మండలంలో 1.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇదీ చదవండి: