కరవుకు మారుపేరైన చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో రైతులు, కూలీలు వలస పోతున్నారు. వాళ్లు వెళ్లేది పొట్ట నింపుకొనేందుకో.. డబ్బు సంపాదించి తిరిగి సొంతూరుకు చేరుకునేందుకో కాదు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు. వృద్ధులు, పిల్లలను గ్రామాల్లో వదిలేసి.. పిల్లలను చదివించేందుకు పరితపిస్తున్నారు. ఆ కష్టానికి ప్రతిఫలంగా.. తంబళ్లపల్లె మండల పరిధిలోని గంగిరెడ్డి పల్లి గ్రామంలో ఈ ఏడాది 10 మంది విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు.
వలసల పోయి.. డబ్బులు పంపి
ఒకప్పుడు చదువులో వెనుకబాటుతనాన్ని.. వ్యవసాయంలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్న గంగిరెడ్డిపల్లిలో ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. కరవు ప్రభావంతో వ్యవసాయం పూర్తిగా డీలా పడినా... విద్యారంగంలో అద్భుత ఫలితాలు సొంతం చేసుకుంటోంది. పదో తరగతి ఫలితాలు, సీఏ సీఎంఏ పరీక్షలు, ఎన్.ఎం.ఎం.ఎస్ పరీక్షలు రాసిన విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఈ గ్రామంలో వలసలు పోగా మిగిలిన రైతులు, కూలీలు గొర్రెల, మేకల పెంపకం, పాడి పరిశ్రమ చేపట్టి కుటుంబాలను పోషిస్తూ... పిల్లలను చదివిస్తున్నారు.
ఒకరా..ఇద్దరా!
గ్రామానికి చెందిన శ్రీలత సీఎంఏ పరీక్షలో జాతీయ స్థాయిలో 24 వ ర్యాంకు సాధించింది. తండ్రి రంగారెడ్డి సౌదీ వెళ్లి పిల్లల చదువు కోసం డబ్బులు పంపిస్తున్నారు. శకుంతల అనే అమ్మాయి మోడల్ పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో 10 గ్రేడ్ పాయింట్ సాధించింది. ఇలా గ్రామంలో అనేక మంది విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబంలో ఒకరిద్దరు ఉన్నత చదువులు చదువుతున్నవారే. పడమటి మండలాల స్థాయిలో ఈ గ్రామం ఆదర్శవంతమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది.